పోరాడి సాధించారు..!
కూలి ధరలు పెంచుకున్న మరమగ్గ కార్మికులు
అండగా నిలబడిన సిఐటియు
కలెక్టర్ చొరవతో సమస్య పరిష్కారం
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
పోరాడితే పోయేది ఏమీ లేదని మరోసారి నిరూపించారు నగరిలోని మరమగ్గ కార్మికులు. అందరూ కలసికట్టుగా సిఐటియు ఆధ్వర్యంలో 14రోజులు పోరాటం నిర్వహించి కూలీ ధరలు పెంచుకున్నారు. మీటరుకు అదనంగా రూ.2.50 సాధించుకున్నారు. పది సంవత్సరాల తరువాత వారు కూలీ ధరలను పెంచుకున్నారు. ఇందులో కలెక్టర్ హరినారాయణన్ చొరవ తీసుకోవడంతో సమస్య సామరస్యంగా పరిష్కారమయ్యింది. దీనిపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పదేళ్లుగా ఒకే ధర ..
నగరి నియోజకవర్గంలో పవర్‌లూమ్ పరిశ్రమ విస్తారంగా విస్తరించింది. ఇక్కడ నగరి, పుత్తూరు, నారాయణవనం మండలాల్లో ఎనిమిదివేల మగ్గాలు ఉన్నాయి. వీటిపైన 12వేల మంది ప్రత్యక్షంగా, 30వేల మంది పరోక్షంగా జీవిస్తున్నారు. వీరంతా మాస్టర్ వీవర్స్ నుంచి నూలు, ఇతర ముడిసరుకు తీసుకొచ్చి బట్టగా తయారు చేసి తిరిగిస్తారు. చుడిదార్‌లు, లుంగీలు, ఓనీలు, షర్టుబిట్టులు, పంచెలు, కాటన్ చీరలు వంటివి తయారు చేస్తుంటారు. ఈ పనికి ఒక మీటరుకు ఇంత కూలీ అని రకాన్ని బట్టి మాస్టర్ వీవర్లు ఇస్తుంటారు. పది సంవత్సరాలకు ముందు ఇస్తున్న ధరలనే నేటికీ చెల్లిస్తున్నారు.
పెరిగిన భారం
మాస్టర్ వీవర్లు ఇస్తున్న ధరలు కార్మికులకు ఏమాత్రం చాలకుండా పోయాయి. ఇది వరకు రూ.300లు వచ్చే విద్యుత్ చార్జీలు ప్రస్తుతం రూ.3వేలకు పెరిగిపోయింది. అంతే కాకుండా మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. అయితే ఇంటిల్లి పాదీ రోజంతా కష్టపడినా వీరికి రూ.300 నుంచి రూ.400కుపైన వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.
పోరాట పంథా
ప్రస్తుతం ఇస్తున్న కూలీ ధరలు ఏ మాత్రం చాలడం లేదని పవర్‌లూమ్ కార్మికులు మాస్టర్‌వీవర్ల వద్ద ఎన్నో సార్లు మొర పెట్టుకున్నారు. అయితే వారు వారు పెంచేందుకు విముకత చూపించేవారు. దీంతో చేసేది లేక ఈ నెల ఐదో తేదీ నుంచి మరమగ్గ కార్మికులు మర మగ్గాలన్నీ ఆపేసి సిఐటియు ఆధ్వర్యంలో సమ్మెకు పూనుకున్నారు. అయినా అధికారుల్లో చలనం లేకపోయే సరికి రెండురోజుల క్రితం నగరి- తమిళనాడు జాతీయ రహదారిని దిగ్బంధించారు. మూడు గంటల పాటు వాహనాలు కదలనీయకుండా చేశారు. ఈ దెబ్బతో అధికారులు కార్మికులు, మాస్టర్ వీవర్లతో చర్చలు జరిపేందుకు ముందుకొచ్చారు. ఇప్పుడిస్తున్న ధరలకు కనీసం రూ.5 పెంచాలని కార్మికులు డిమాండు చేశారు. దీనికి మాస్టర్ వీవర్లు ఒప్పుకోలేదు.
కలెక్టర్ చొరవ - సమస్య పరిష్కారం
ఈ సమస్యను సిఐటియు నాయకులు కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు. దీంతో రెండు దఫాలు చర్చలు సాగాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఈసమస్య పరిష్కారమయ్యింది. మీటరుకు రూ.2.50ల పెంచుతామని మాస్టర్ వీవర్లు అధికారుల సమక్షంలో ఒప్పుకున్నారు. ఈధరలు ఆగస్టు నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. దీనికి మరమగ్గ కార్మికులు కూడా ఒప్పుకోవడంతో సమస్య పరిష్కారమయినట్లు అయ్యింది.
ఐక్య పోరాటం వల్లే
ఈ కూలీ పెంచుకునేందుకు మరమగ్గ కార్మికులందరూ ఐఖ్యంగా పోరాటం నిర్వహించడం వల్లే సాధ్యమైంది. వీరు 14 రోజులుగా పోరాడుతున్నా స్థానికంగా ఉన్న అధికారులు పట్టించుకోకపోవడం దారుణం. కలెక్టర్ చొరవ తీసుకుని చర్చలు పెట్టించడం వల్లే సమస్య పరిష్కారమయ్యింది. ఆయనకు సిఐటియు తరపున అభినందనలు తెలుపుతున్నాం. ఇదే స్పూర్తితో ఇక్కడున్న కార్మికులు ఇఎస్‌ఐ వంటి సదుపాయాలు కూడా కల్పించుకోవాలి.
- వాడ గంగరాజు, చైతన్య, సిఐటియు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు










