
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: పోలియో నిర్మూలనే ధ్యేయమని రోటరీ క్లబ్ పోలియో నివారణ కమిటీ చైర్మన్ ఎం.ఆర్.కె దాస్ అన్నారు. ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యాన పోలియోపై అవగాహన విరాళాల సేకరణను మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీ ఇంటర్నేషనల్ 1979 సంవత్సరంలో పోలియో నిర్మూలనకు పోరాటం ప్రారంభించిందన్నారు. ఇప్పటివరకు 99.9 శాతం పోలియోని నిర్మూలించామని చెప్పారు. ఇంకా కొన్ని దేశాల్లో కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. పోలియో నిర్మూలనకు ఇచ్చే ప్రతి రూపాయికి బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ రూ.రెండు జత చేసి పోలియో నిధికి అందిస్తుందని వివరించారు. అందరూ విరాళాల రూపంలో మరింత ఆర్థిక సహకారాన్ని అందించాలని కోరారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు గీతా శ్రీకాంత్, కార్యదర్శి ఎ.అనంతరావు, సెక్రటరీ డి.శివశంకర్, సంయుక్త కార్యదర్శి బరాటం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.