May 23,2023 21:54

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్‌

         ప్రజాశక్తి-శింగనమల    'ఇంటి వద్ద ఘర్షణ విషయలో పోలీసులు తనను అకారణంగా వేధిస్తున్నారని, ఈ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను'.. అంటూ సెల్ఫీ వీడియో తీసుకుని ఓ యువకుడు వాస్మోయిల్‌ తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన శింగనమల మండల పరిధిలోని తరిమెల గ్రామంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. బాధితుని కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... తరిమెల గ్రామానికి చెందిన దంపతులు వెంకటేష్‌, సరస్వతి ఇంటికి ఎదురుగా గంపమలయ్య, సులోచన కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ రెండు కుటుంబాల మధ్య తరచూ గొడలు జరుగుతుండేవి. గతంలో ఇంటి ముందు నీరు పారే విషయంలో ఘర్షణ జరిగింది. ఈ వివాదం స్టేషన్‌ వరకూ వెళ్లింది. ఈ ఘర్షణకు సంబంధించి పదో తరగతి చదువుతున్న వెంకటేష్‌, సరస్వతి కుమారుడు రాజేష్‌పైనా పోలీసు కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఈ రెండు కుటుంబాల మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. అక్కడితో ఆగకుండా గంపమలయ్య మధ్యాహ్నం అతని బంధవులను తీసుకొచ్చి మరోసారి వెంకటేష్‌తో గొడవపడ్డారు. ఈ గొడవలో రాజేష్‌పై దాడి జరిగింది. దీంతో రాజేష్‌, కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం సాయంత్రం 4 గంటలకు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని గంపమల్లయ్య కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు రాజేష్‌ ఫిర్యాదు తీసుకోకపోవడంతో స్టేషన్‌ వద్దే వేచి ఉన్నాడు. ఇదిలాఉండగా గంపమల్లయ్య సాయంత్రం 6 గంటలకు వైసిపికి చెందిన ఓ ముఖ్య నాయకునితో మండలంలోని పోలీసు ఉన్నతాధికారిపై ఒత్తిడి తీసుకొచ్చి రాజేష్‌పై అత్యాచారయత్నం కేసు నమోదు చేయించాడు. ఈ కేసును తీసుకున్న పోలీసులు రాజేష్‌ను స్టేషన్‌లో విచక్షణా రహితంగా కొట్టించారని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అనంతరం రాత్రి 9గంటల సమయంలో రాజేష్‌ను పోలీసులు ఇంటికి పంపారు. మంగళవారం ఉదయం మరోసారి పోలీస్‌స్టేషన్‌కు రావాలని పోలీసులు ఆదేశించారు. మంగళవారం తీవ్ర భయాందోళనకు గురైన రాజేష్‌ ఉదయం 8.30 గంటలకు ఓ సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో తెలిపాడు. తన చావుకు ఎదురింటి గంపమల్లయ్య కుటుంబ సభ్యులు, పోలీసులు కారణమని అందులో పేర్కొన్నాడు. సెల్ఫీ వీడియో తీసుకుంటూనే సూపర్‌ వాస్మోల్‌ తాగాడు. ఈ వీడియోను వాట్సాప్‌ ద్వారా బంధువులకు పంపడంతో వారు తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు. వెంటనే తల్లిదండ్రులు, బంధువులు 108 ద్వారా రాజేష్‌ను చికిత్స నిమిత్తం అనంతపురం పెద్దాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాజేష్‌ పరిస్థితి విషమంగా ఉందని, ఐసియులో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
కౌన్సెలింగ్‌ కోసమే రమ్మన్నాం.. : ఎస్‌ఐ బాలకష్ణయ్య
రాజేష్‌పై గతంలో కేసు నమోదై ఉండటంతో కౌన్సెలింగ్‌ నిమిత్తం స్టేషన్‌కు పిలించాం. సోమవారం నాడు కౌన్సెలింగ్‌ ఇచ్చి ఇంటికి పంపాం. ఉదయం సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నాం.