అర్జీలు స్వీకరిస్తున్న దృశ్యం
పోలీసు స్పందనలో 165 ఫిర్యాదులు స్వీకరణ
ప్రజాశక్తి-నెల్లూరు:స్థానిక ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక 'స్పందన' కార్యక్రమంలో ఉద్యోగాల పేరిట మోసం, వద్ద తల్లిదండ్రులు వేధింపులు, భర్త/అత్తారింటి వేధింపులు, దొంగతనం, భూ, ఆస్థి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, అనధికార చీటీలు, ఉద్యోగాలు, కుటుంబ కలహాలు, నమోదైన కేసులలో పురోగతి, ఇతర వివాదాలు, సమస్యలకు చెందిన 165 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎస్‌పి డాక్టర్ కె.తిరుమలేశ్వరరెడ్డి తెలిపారు. సోమవారం పోలీసు పేరేడ్ గ్రౌండ్‌లోని ఉమేష్ చంద్రా కాన్ఫరెన్స్ హాల్‌లో స్పందన కార్యక్రమంలో ఎస్‌పి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సమాజంలో పేదరికాన్ని అవకాశంగా తీసుకొని యువతకు పలు ప్రయివేట్, ప్రభుత్వ శాఖలల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామంటూ నమ్మకంగా మాటలు చెప్పే వ్యక్తులను నమ్మి ఆర్ధిక ఇబ్బందులకు గురికారాదని హెచ్చరించారు. ఆ విధంగా ఎవరైనా మోసపోయి ఉంటే పూర్తి సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని కోరారు. పోలీసు స్టేషన్లలో నమోదు అవుతున్న వరకట్నపు హత్య, అనుమానాస్పద మరణాలు, మిస్సింగ్ కేసులలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి లోతుగా దర్యాప్తు జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని బాధితులకు న్యాయం జరిగేలా వ్యవహరించాలని సిబ్బందికి సచనలు చేశారు. నేటి సమాజంలో జన్మనిచ్చి , పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వద్దాప్యంలో జాగ్రత్తగా చూసుకోవాల్సిన పిల్లలు కొంత మంది తమ తల్లిదండ్రులను బాధలకు గురి చేస్తున్నారంటూ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు అవుతున్నాయని, అంతే కాకుండా స్పందన కార్యక్రమానికి సైతం అనేక మంది వృద్దులు ఫిర్యాదులు చేస్తున్నారని, ఇటువంటి సమస్యలపై పోలీసులు స్పందించి తక్షణమే మానవతాదక్పధంతో పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పోలీసు స్టేషన్ల పరిధిలో ఇప్పటి వరకు నమోదు కాబడిన దొంగతనం, తగదాల కేసులలో దర్యాప్తు పూర్తి చేసి అలసత్వం లేకుండా ముద్దాయిలపై చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సలహాలు, సూచనలు చేశామన్నారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసుల దృష్టికి వస్తున్న భూ, స్థలం, ఆస్థి, నకిలీ పత్రాలకి సంబంధించిన వివాదాలను అతి సున్నిత అంశాలను పరిగణించి శాంతి భద్రతలకు విఘాతం లేకుండా న్యాయపరమైన సూచనలతో చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ స్పందన కార్యక్రమంలో అడిషనల్ ఎస్‌పి (అడ్మిన్), (క్రైమ్స్) డిఎస్‌పి సెల్-2, ఏఆర్ డిఎస్‌పి, ఎస్‌బి సిఐ-2, వెల్ఫేర్ ఆర్‌ఐ, కంప్లైంట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.










