Aug 30,2023 22:10

బాధితురాలికి చెక్కు అందజేస్తున్న ఎస్పీ శ్రీనివాసరావు

         ప్రజాశక్తి-అనంతపురం క్రైం   రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యం తదితర కారణాలతో జిల్లాలో మృతిచెందిన పోలీసు అధికారులు, సిబ్బంది కుటుంబ సభ్యులకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ కె.శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు. మృతిచెందిన పోలీసు అధికారులు, సిబ్బంది కుటుంబ సభ్యులతో బుధవారం స్థానిక పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో ఎస్పీ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి, అంతకు ముందుగానీ కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది వివిధ కారణాలతో చనిపోవడం బాధ కలిగించిందన్నారు. ఆయా కుటుంబాలకు అండగా ఉండటమే కాకుండా, జాప్యం లేకుండా ప్రయోజనాలు అందజేస్తున్నామన్నారు. కారుణ్య నియామకాల విషయంలో కూడా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అనంతరం దివంగత సీఐ ఆనందరావు, ఏఆర్‌ కానిస్టేబుల్‌ భాస్కర్‌ రెడ్డి కుటుంబ సభ్యులకు ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున రెండు లక్షల చెక్కులను అందించారు. అలాగే ఇటీవల మృతిచెందిన బ్రహ్మసముద్రం కానిస్టేబుల్‌ ఉమేష్‌ (పీసీ నెంబర్‌ 3059) కుటుంబానికి విడో ఫ్లాగ్‌ ఫండ్‌ కింద రూ.75 వేలు విలువజేసే చెక్కులను ఉమేష్‌ భార్య వనితకు ఎస్పీ అందజేశారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఆర్‌.విజయభాస్కర్‌రెడ్డి, ఎఆర్‌ డీఎస్పీ మునిరాజ్‌, ఆర్‌ఐ రాముడు, జిల్లా పోలీసు కార్యాలయం పరిపాలనా అధికారి శంకర్‌, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్‌ కమిటీ సభ్యులు సాకే త్రిలోకనాథ్‌, సుధాకర్‌రెడ్డి, తేజ్‌పాల్‌, జిల్లా పోలీసు కార్యాలయం సూపరింటెండెంట్లు శ్రీనివాసులు, సావిత్రమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.