Apr 08,2023 22:40

అనంత ఎస్పీ కె.శ్రీనివాసరావు, సత్యసాయి ఎస్పీ ఎస్‌వి.మాధవరెడ్డి

       అనంతపురం ప్రతినిధి : రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ల బదిలీలు జరిగిన వెంటనే పోలీసు ఉన్నతాధికారుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం రేంజ్‌ డిఐజితోపాటు అనంతపురం, పుట్టపర్తి జిల్లాల ఎస్పీలు బదిలీ అయ్యారు. అనంతపురం రేంజ్‌ డిఐజి రవిప్రకాశ్‌ను సెబ్‌ డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌ జనరల్‌గా బదిలీ అయ్యారు. ఆ స్థానంలోకి ఎఐజి డిఐజిగానున్న ఆర్‌ఎన్‌.అమ్మిరెడ్డిని నియమించారు. అనంతపురం ఎస్పీగానున్న ఫక్కీరప్పను సిఐడి ఎస్పీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో వెయిటింగ్‌లో కె.శ్రీనివాసరావును నియమించారు. పుట్టపర్తి ఎస్పీగానున్న రాహుల్‌దేవ్‌ శర్మను ఐదవ బెటాలియన్‌ కమాండెంట్‌గా నియమించారు. ఈ స్థానంలో ఎస్‌వి.మాధవరెడ్డిని పుట్టపర్తి ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గ్రూపువన్‌ ఆఫీసర్‌గా చేరి డిఐజిగా ఆర్‌ఎన్‌.అమ్మిరెడ్డి
ఆర్‌ఎన్‌.అమ్మిరెడ్డి 2001లో గ్రూపు వన్‌ ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరారు. తిరుపతి అర్బన్‌ అడిషనల్‌ ఎస్పీగానూ, గుంటూరు విజిలెన్సు ఎస్పీగానూ పనిచేశారు. 2009లో ఐపిఎస్‌ కన్‌ఫర్డు అయిన తరువాత శ్రీకాకుళం ఎస్పీగానూ, గుంటూరు అర్బన్‌ ఎస్పీగానూ పనిచేశారు. ప్రస్తుతం ఎఐజి లా అండ్‌ ఆర్డర్‌లో పనిచేస్తున్నారు. ఆయన్ను అనంతపురం రేంజ్‌ డిఐజిగా ప్రభుత్వం ఇప్పుడు నియమించింది.
అనంతపురం ఎస్పీగా కె.శ్రీనివాసరావు
అనంతపురం జిల్లా ఎస్పీగా కె.శ్రీనివాసరావు నియమితులయ్యారు. గ్రూపు ఆఫీసర్‌గా పోలీసు శాఖలో చేరిన శ్రీనివాసరావు శ్రీకాకుళం సెబ్‌ ఎస్పీగానూ, విజయవాడ అసిస్టెంట్‌ కమిషనర్‌గానూ పనిచేశారు. వెయింటింగ్‌లో ఉన్న ఆయన్ను ఇప్పుడు అనంతపురం జిల్లా ఎస్పీగా నియమించారు.
పుట్టపర్తి ఎస్పీగా ఎస్‌వి.మాధవరెడ్డి
2010 గ్రూపు వన్‌ అధికారిగా ఉద్యోగంలో చేరిన ఎస్‌వి.మాధవరెడ్డి పుట్టపర్తి ఎస్పీగా నియమితులయ్యారు. ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌గా విధుల్లోకి మొదట చేరారు. ఆ తరువాత డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫీసర్‌గా నిర్మల్‌, కర్నూలు జిల్లా ఆత్మకూరు డీఎస్పీగా వచ్చారు. 2018లో అడిషనల్‌ ఎస్పీగా ఉద్యోగోన్నతి పొందారు. గుంటూరు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారిగానూ పనిచేశారు. ప్రస్తుతం ఆయన వెయిటింగ్‌లోనున్నారు. ప్రస్తుతం పుట్టపర్తి ఎస్పీగా నియమితులయ్యారు.