Aug 23,2023 22:25

పోలీస్‌ అండతో దౌర్జన్యాలు
బిసివైపి అధ్యక్షులు రామచంద్ర యాదవ్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి పోలీసుల అండతో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, శాంతి భద్రతలు కాపాడాల్సిన జిల్లా ఎస్పీ అధికార పార్టీ తొత్తుగా వ్యవహరిస్తున్నారంటూ పుంగనూరు ఘటనలో చిత్తూరు సబ్‌జైల్లో ఉన్న వారిని బిసివైపి అధ్యక్షులు రామచంద్ర యాదవ్‌ బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుంగనూరు ఘటనలో జిల్లా ఎస్పీ వ్యవహరించిన తీరు వల్లే ఘర్షలు చోటు చేసుకున్నాయని, కేసులు పెట్టాల్సి వస్తే మంత్రి పెద్దిరెడ్డి, జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డిపై పెట్టాలన్నారు. ఇసుక, గనులు, ఎర్రచందనం యద్ధేచ్చగా దోపిడీ చేస్తుంటే అరిక్టలేని ఎస్పీ ప్రతి పక్షాలపై తప్పడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఆరునెలల్లో పుంగనూరులో పెద్దిరెడ్డి ఓడిపోవడం తధ్యమని విదేశాల్లో తలదాచుకోక తప్పదన్నారు. నేడు అధికార పార్టీలకు తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులు ఖచ్ఛితంగా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సబ్‌జైల్లో ఉన్న వారిని పరామర్శించేందు వచ్చిన తనను జైల్‌ అధికారులు ఇబ్బంది పెట్టారన్నారు. పుంగనూరు ఘటనకు పూర్తిగా జిల్లా ఎస్పీ బాధ్యత వహించాలన్నారు. తాను రాజకీయ మార్పు కోసమే భారతీయ చైతన్య యువజన పార్టీని ఏర్పాటు చేసిన్నట్లు తెలిపారు.