
ప్రజాశక్తి - పొందూరు: పొందూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంపై ఆర్‌జెడి ఎస్.శోభారాణి శుక్రవారం విచారణ చేపట్టారు. కళాశాలలో ఫీజులు వసూలు చేసి రశీదులు ఇవ్వడం లేదని, ఫీజులు చెల్లించినా మళ్లీ చెల్లించాలంటూ వేధిస్తున్నారని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ డి.రామారావు కళాశాలకు సక్రమంగా హాజరు కావడం లేదని, కళాశాలలో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ చెప్పారు. దీంతో ఆర్‌జెడి కళాశాలను సందర్శించి ప్రిన్సిపాల్‌ను, విద్యార్థులను, బోధన, బోధనేతర సిబ్బందిని విచారించారు. ఇక్కడ ఒకే ప్రాంగణంలో నిర్వహిస్తున్న జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలను షిఫ్టు పద్ధతిలో నిర్వహించాలని సూచించారు. విద్యార్థుల ఫిర్యాదు మేరకు చేపట్టిన విచారణపై పలు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.