ప్రజాశక్తి-అనంతపురం ప్రజలందరూ పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ యుగంధర్ పిలుపునిచ్చారు. పొగు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సిగరెట్టు, పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే దుష్ప్రరిణామాలపై ఆదివారం నగరంలోని తపోవనం క్రికెట్ స్టేడియంలో అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా పొగాకుకు దూరంగా ఉంటామని స్థానికుతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన ఆహారం తీసుకోవాలేగానీ, పొగాకు కాదన్నారు. కావున ప్రజలందరూ మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలన్నారు. పొగాకు వినియోగం వల్ల ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు పర్యావరణ కాలుష్యం అవుతుందన్నారు. పొగాకు ఏ రూపంలో వాడినా మానవాళి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందన్నారు. అలాగే ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థల పరిధిలో ఉన్న దుకాణాల్లో సిగరెట్, పొగాకు ఉత్పత్తులను అమ్మకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా ధూమపానం వల్ల 8లక్షల మిలియన్ మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నారన్నారు. పొగాకు తాగడం వల్ల మనిషి అవయవాలపై ప్రభావం చూపించి క్యాన్సర్‌కు కారణం అవుతుయన్నారు. అలాగే బహిరంగ ధూమపానం చేసినా, ప్రభుత్వ కార్యాలయాల పరిధిలోని 100 గజాలలోపు ఎవరైనా దుకాణాల్లో పొగాకు ఉత్పత్తులను విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు రూ.200 జరిమానా విధించనున్నట్లు తెలిపారు. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గంగాధర్‌రెడ్డి మాట్లాడుతూ పొగాకు ఏ రూపంలో వినియోగించినా మనకే నష్టం అన్నారు. ఆర్థికంగా సామాజికంగా కుటుంబ పరంగా అనేక సమస్యలు తలెత్తుతాయన్నారు. కురుగుంట మెడికల్ ఆఫీసర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంలో భాగంగా 60 రోజులు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పొగాకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించనున్నట్లు తెలిపారు. పొగాకు నియంత్రణ జిల్లా సోషల్ వర్కర్ శ్రీరాములు మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు సిఒటిపిఎ యాక్ట్-2003, టిఒఎఫ్‌ఇఐని పటిష్టంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సిడి ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ రామాంజనేయులు, మెడికల్ ఆఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు.
ప్రమాణం చేయిస్తున్న జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి యుగంధర్










