Jun 26,2022 22:46

మహిళలకు మోగా చెక్కును అందిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి, జెడ్‌పి ఛైర్మన్‌ వాసు, ఎమ్మెల్యే వెంకటే గౌడ

రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి
ప్రజాశక్తి- వికోట:
రాష్ట్రంలోని ప్రతి మహిళ పొదుపులు అలవర్చుకున్నప్పుడు వారి కుటుంబాలు ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు దోహద పడుతుందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన వికోటలో నిర్వహించిన అమ్మాక్ట్స్‌ మహిళా పరస్పర సహాయక సహకార పొదుపు సంఘం 25వ మహాసభ సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తన పాలనలో ప్రతి సంక్షేమ పథకం మహిళలకే మంజూరు చేయడాన్ని వారికి మహిళల పట్ల ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని మోసం చెయ్యడాన్ని మహిళా సంఘాలు ఎప్పటికీ మరచిపోరన్నారు. జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికలకు ముందు డ్వాక్రా సంఘాల మహిళలకు ఇచ్చిన హామీ మేరకు విడతలవారీ రుణమాఫీ చేసి చూపారని తెలిపారు. ఇదే స్ఫూర్తితో గడచిన 25 సంవత్సరాల నుండి వికోటలో దశరథరెడ్డి అమ్మాక్ట్స సంస్థను స్థాపించి ఆంధ్రా, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మహిళా గ్రూపు సభ్యులను సంఘాలుగా ఏర్పాటు చేసి ఆర్థిక సహకారాన్ని అందించి వారిని ఆర్థికశక్తిగా బలోపేతం చేశారని కొనియాడారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు వారిలో చైతన్యం నింపి క్రమశిక్షణతో సమాజసేవలో ముందుకెళ్తున్న దశరథరెడ్డి సేవలు ఎక్కువ రంగాల్లో విస్తరించాలని పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ కోరారు. ఇదే స్ఫూర్తితో ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో ప్రజల సౌకర్యార్థం అధునాతన సదుపాయాలతో మరుగుదొడ్ల నిర్మాణానికి దశరథరెడ్డి హామీ ఇచ్చారు. అలాగే చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో తన సేవలతో మహిళా సంఘాల బలోపేతానికి కషి చేస్తున్న దశరథరెడ్డి సేవలను ఎంపి రెడ్డెప్ప కొనియాడారు. సంస్థ సహకారంతో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన దశరథరెడ్డి తన సేవలను మరింత విస్తరించాలని ఎమ్మెల్సీ భరత్‌ కోరారు. అనంతరం ఈ సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలు రూ.10లక్షలకు పైగా ఉపకారవేతనాలను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఇదే స్ఫూర్తితో రాబోయే ఆర్థిక సంవత్సరంలో మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు మహిళా సంఘాలు ప్రభుత్వ పాలకులు సహాయ సహకారాలందించాలని దశరథరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ పీఎన్‌.లక్ష్మి ఎంపీపీ యువరాజ్‌, వైసిపి రాష్ట్రప్రధాన కార్యదర్శులు పిన్‌.నాగరాజు, బైరెడ్డిపల్లి కష్ణమూర్తి రెడ్డప్ప, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.