May 20,2023 21:45

ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు జి.ఓబులు

          ప్రజాశక్తి-గార్లదిన్నె 'ఎండలు మండి పోతున్నాయి.. పనులు చేసే చోట సౌకర్యాలు లేవు..పనిముల్లు లేవు.. పనులు చేయాలంటే చాలా కష్టంగా ఉంది సారూ..' అంటూ సిఐటియు నాయకుల ఎదుట ఉపాధి కూలీలు వాపోయారు. శనివారం మండల పరిధిలోని కోటంక గ్రామంలో ఉన్న నడిమి గుట్ట వద్ద చేపట్టిన ఉపాధి పనులను సిఐటియు నాయకులు పరిశీలించి కూలీలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై కూలీలు లబోదిబోమన్నారు. నాలుగు సంవత్సరాలుగా ఉపాధి హామీ పని దినాలు తగ్గించారన్నారు. కూలి రేట్లు కూడా రూ.వంద నుంచి రూ.150 లోపే ఉంటోందన్నారు. అలాగే గతంలో ఇస్తున్న గడ్డపార్లు, పారలు ప్రస్తుతం ఇవ్వడం లేదన్నారు. అదేవిధంగా గ్రామం నుంచి మూడు కిలోమీటర్ల దూరం పనికి వెళ్లే వారికి ఆటో ఛార్జీలు ఇవ్వడం లేదన్నారు. అలాగే వేసవి అలవెన్స్‌ ఇవ్వడం లేదన్నారు. ఇకపోతే మరీ ముఖ్యంగా పనికి వచ్చిప్పుడు ఒక ఫొటో, పని అయిపోయిన తర్వాత మరో ఫొటో తీసుకోవాలని తప్పనిసరి చేశారన్నారు. దీనివల్ల చాలా నష్టపోతున్నామన్నారు. ఎందుకంటే వచ్చేటప్పుడు కొంత ఆలస్యంగా వచ్చినా పోయేటప్పుడు ఆలస్యంగా పని చేసుకుని వెళ్తామన్నారు. అలాకాకుండా తప్పనిసరిగా ఫొటో తీసుకోవాలని చెప్పడం చాలా నష్టపోతున్నామన్నారు. దీనికితోడు పని చేసిన జంటలో కొలతలు తీసినప్పుడు ఎవరో ఒకరు ఉంటే చాలు.. అలాకాకుండా అందరూ ఉండాలని చెప్పడం బాధాకరమన్నారు. గతంలో ఎండకు పెద్దలు, పిల్లలు సేద తీర్చు కోవడానికి పట్టలు, మజ్జిగ ఇచ్చేవారని, ఇప్పుడు కనీసం తాగునీటి ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర నాయకులు జి.ఓబులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి కూలీల పట్ల నిర్లక్ష్యంగా, నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నాయన్నారు. దీంతో కూలీ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. అలాగే పని దినాలు పెంచాలని, పనితగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పనులు చేసే చోట కనీస మౌలిక వసతులు కల్పించాలని, లేనిపక్షంలో రానున్న రోజుల్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి చెన్నారెడ్డి, నాయకులు నాగమ్మ, మల్లికార్జున, పెద్దన్న, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నారాయణరెడ్డి, సుధాకర్‌, సీనా, సుగుణమ్మ, నాగార్జున, తదితరులు పాల్గొన్నారు.