Aug 22,2022 22:26

మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న కార్మికులు, టిడిపి నేతలు

స్థానిక వాహనాలకు ఎపుడూ లేనిది ఇప్పుడెందుకు..
ఏ జిల్లాలో లేని నియమ నిబంధనలు కుప్పంలోనే..
దౌర్జన్యంగా వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి
మునిసిపల్‌ గెజిట్‌ ప్రకారం గేటు వసూలు చేయాలి
ప్రజాశక్తి - కుప్పం

స్థానిక వాహనాలకు ఎప్పుడులేని విధంగా ఇప్పుడు పన్నులు ఎందుకు కట్టాలంటూ టెంపో, ఆటో డ్రైవర్లు సోమవారం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక చెరువు కట్టమీద నుంచి మున్సిపల్‌ కార్యాలయం వద్ద వరకు సుమారు 70 టెంపోలు, ఆటోలతో ర్యాలీ నిర్వహించి మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు టెంపో, ఆటో కార్మికులకు మద్దతు పలకగా మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ... కుప్పం ప్రాంతంలోని కార్మికులను చూస్తే ఏదో కక్షపూరితంగా ఇలాంటి గేట్లు వసూలు చేస్తూ వారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టేలా పరిస్థితి తయారైందన్నారు. స్థానిక వాహనాలకు గేటు ఏత్తివేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల సమస్యలు పట్టించుకోని మునిసిపల్‌ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. కుప్పం మున్సిపల్‌ కార్యాలయం వద్ద భారీ ఎత్తున వాహనాలు రోడ్డుకి అడ్డంగా నిలవడంతో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది. సంఘటన స్థలానికి చేరుకున్న కుప్పం సిఐ శ్రీధర్‌, ఎస్సైలు శివకుమార్‌, రామలక్ష్మిరెడ్డి కార్మికులతో చర్చించి ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్డుపై వాహనాలు నిలిపి నిరసన ఎలా చేపడుతారంటూ పోలీసులు కార్మికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగేలా రోడ్లపై నిరసన కార్యక్రమాలు చేపడితే కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరించారు. కార్మికుల సమస్యలు తమకు తెలిపితే మున్సిపల్‌ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి రెండు, మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కార్మికులు నిరసన కార్యక్రమాన్ని విరమించారు. దీనికి సంబంధించి టెంపో, లగేజ్‌ ఆటో డ్రైవర్లు వారి సమస్యలను అర్జీ రూపంలో మున్సిపల్‌ అధికారులకు అందజేశారు. ఈకార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు, టెంపో లగేజ్‌ ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.