Mar 21,2023 21:39

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభిస్తున్న విప్‌ కాపు

            ప్రజాశక్తి-రాయదుర్గం   పని తెలిసిన వారికి, నేర్చుకున్న వారికి ఎక్కడైనా ఉపాధి లభిస్తుందని విప్‌ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ- జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వైఎస్‌ఆర్‌ క్రాంతి పథం సంయుక్తంగా మంగళవారం పట్టణంలోని పుర-కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాన్ని విప్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకెపి, స్వయం సహాయక సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్వయం ఉపాధి కోసం కుట్టు శిక్షణ పొందిన మహిళలు ఆర్థిక సాయం పొందవచ్చన్నారు. తద్వారా ఉపాధితో కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుచుకోవచ్చన్నారు. సిఎం జగన్‌ మహిళా పక్షపాతి కావడం వల్లే మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. పురపాలక సంఘం అధ్యక్షురాలు పొరాలు శిల్ప మాట్లాడుతూ మహిళలు ఉచిత కుట్టు శిక్షణ పొంది స్వశక్తితో ఆర్థిక స్వావలంబన పొందాలన్నారు. ఐకెపి ఏరియా కోఆర్డినేటర్‌ గంగాధర్‌ మాట్లాడుతూ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో స్థానిక శిక్షణా కేంద్రంలో ఒక్కొక్క విడతకు 30 మంది చొప్పున మహిళలకు నెలన్నర రోజులపాటు కుట్టు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. తొలి విడతగా రాయదుర్గం మండలం కొండాపురం చదం, చదం-గొల్లలదొడ్డి గ్రామాలకు చెందిన మహిళలకు కుట్టు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా ఛైర్‌పర్సన్‌ కాపు భారతి, రాయదుర్గం పురపాలక సంఘ ఉపాధ్యక్షులు వలిబాషా, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధ్యక్షులు భోజరాజు నాయక్‌, ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, పురపాలక సంఘం మాజీ అధ్యక్షులు గౌని ఉపేంద్రరెడ్డి, మున్సిపల్‌ వార్డు సభ్యులు శారద, దేవరాజ్‌, శివకుమార్‌, వైకాపా నాయకులు శివ, నిజాముద్దీన్‌, కృష్ణమూర్తి, బషీర్‌, రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.