Jun 21,2023 22:23

ఎస్‌ఎస్‌ఎ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్న సిఐటియు నాయకులు, గెస్ట్‌ ఫ్యాకల్టీ ఉద్యోగులు
  • కొత్తవారి కోసం పాతవారికి అన్యాయం
  • ఎస్‌ఎస్‌ఎలో ఉద్యోగాల కౌన్సిలింగ్‌ను అడ్డుకున్న సిఐటియు
  • ఉద్రిక్తతల నడుమ కౌన్సిలింగ్‌ను నిలిపేసిన అధికారులు

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ : కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో కొత్త నియామకాల పేరుతో ప్రస్తుతం పని చేస్తున్న గెస్ట్‌ ఫ్యాకల్టీ, టీచర్‌లను ఎలా తొలగిస్తారని, ఇది అన్యాయమైన చర్యని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో నూతనంగా కాంట్రాక్ట్‌ పద్ధతిన 250 పోస్టుల భర్తీ కోసం ఎంపికైన అభ్యర్థులకు బుధవారం నాడు అనంతపురం ఎస్‌ఎస్‌ఎ కార్యాలయం వద్ద కౌన్సిలింగ్‌ నిర్వహించారు. ఇది వరకే ఆ పోస్టుల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీగా సిబ్బంది పని చేస్తున్నారు. కాంట్రాక్ట్‌ పద్ధతిన ఆ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ పోస్టులకు గెస్ట్‌ ఫ్యాకల్టీలు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఎంపిక జాబితాలో వారి పేర్లు లేకపోవడంతో తమకు అన్యాయం చేస్తున్నారంటూ సిఐటియు ఆధ్వర్యంలో ఎస్‌ఎస్‌ఎ కార్యాలయం ఆవరణంలో బుధవారం మధ్యాహ్నం నుంచి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌, నగర కార్యదర్శి వెంకటనారాయణ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేష్‌, డివైఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డిలు హాజరై కౌన్సిలింగ్‌ను అడ్డుకున్నారు. ప్రస్తుతం పని చేస్తున్న గెస్ట్‌ ఫ్యాకల్టీలను కొనసాగించాల్సిందే అంటూ ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్‌ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ రెగ్యులర్‌ చేస్తామని హామీ ఇచ్చారని, దానిని అమలు చేయకపోగా ఉన్న పోస్టులను తొలగించడం అన్యాయంగా ఉందన్నారు. కెజిబివిల్లో పని చేయడానికి గెస్ట్‌ ఫ్యాకల్టీలను 8 ఏళ్ల క్రితం నోటిఫికేషన్‌ జారీ చేసి భర్తీ చేశారని తెలిపారు. 8 సంవత్సరాలుగా పనిచేస్తున్న వారిని రెన్యువల్‌ చేయకుండా వాళ్లని తొలగించి కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వడం దుర్మార్గంగా ఉందన్నారు. రాష్ర వ్యాప్తంగా 1280 పోస్టులు, జిల్లాలో 280 పోస్టులకు కొత్త నోటిఫికేషన్‌ జారీ చేశారని తెలిపారు. ఉన్న వారినే తొలగించే కుట్రలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందన్నారు.
ఈ కొత్త నోటిఫికేషన్‌ వల్ల జిల్లాలో పని చేస్తున్న 250 మంది కుటుంబాలు రోడ్డున పడుతాయని తెలిపారు. ఇప్పటి వరకు పని చేస్తున్న వారిని కొనసాగించాలన్నారు. వారిని కొనసాగించి మిగిలి ఉన్న ఖాళీ పోస్టును కొత్త వారికి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరిత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళన తీవ్రం కావడంతో అధికారులు కౌన్సెలింగ్‌ను నిలిపివేశారు. రాత్రి పొద్దుపోయే వరకు గెస్ట్‌ ఫ్యాకల్టీలు ఎస్‌ఎస్‌ఎ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ఒకటవ పట్టణ ఎస్‌ఐ తిప్పయ్య నాయక్‌, పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. ఫోన్‌ ద్వారా డిఇఒ సాయిరాంతో మాట్లాడారు. వీరి డిమాండ్‌ న్యాయమైనదే అని, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామి ఇచ్చారు. ఆ విషయాన్ని ఎస్‌ఐ ఆందోళన కారులకు తెలియజేశారు. అయితే కౌన్సెలింగ్‌ నిలిపివేయాలని, తమ సమస్య పరిష్కరించిన తరువాతనే మిగతా ప్రక్రియ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు అధికారులు అంగీకరించి బుధవారం నాడు కౌన్సిలింగ్‌ను నిలిపేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శివ, రజిత, గెస్ట్‌ ఫ్యాకల్టీలు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.