
* 'స్పందన'లో రైతుల వినతులు
* వంశధార ఎస్‌ఇ డోల తిరుమలరావుకు మెమో జారీ
ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్: వంశధార ఎడమ కాలువ ఆయకట్టు కింద నందిగాం, పలాస, వజ్రపుకొత్తూరు మండలాలకు సాగునీరు అందడం లేదని పాతటెక్కలి, పొల్లాడ, సైనూరు, జగన్నాథపురం, గోవిందపురం, కణితివూరు ప్రాంతాల నుంచి రైతులు వినతులు అందజేశారు. నగరంలోని జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. పలు వ్యక్తిగత, సామాజిక సమస్యలపై 229 వినతులు వచ్చాయి. కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, జాయింట్ కలెక్టర్ నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయదేవి వినతులను స్వీకరించారు. కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్, నందిగాం ఎంపిపి ఎన్.శ్రీరామ్మూర్తి ఆధ్వర్యాన నందిగాం మండల రైతులు వినతిపత్రాలను అందజేశారు. ప్రస్తుతం పొట్టదశలో ఉన్న వరికి తక్షణమే సాగునీరు అందించాలని కోరారు. నదిలో నీటి నిల్వలు తగ్గాయని వంశధార ఎస్‌ఇ డోల తిరుమలరావు చెప్పడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటర్ మేనేజ్‌మెంట్ నిర్వహణలో విఫలమయ్యారని మెమో జారీ చేశారు. పలు పాఠశాలల్లో చేపట్టిన నాడు-నేడు పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోగా, వేరే వ్యక్తి ఖాతాలో విద్యాశాఖ అథికారులు జమ చేశారని కాంట్రాక్టరు జగదీష్ ఫిర్యాదు చేశారు. బిల్లుల చెల్లింపులో అక్రమాలు చోటుచేసుకున్నాయని, తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని సమగ్ర శిక్ష ఎపిసి రోణంకి జయప్రకాష్‌ను కలెక్టర్ ఆదేశించారు. ఆరోగ్యం క్షీణించిన చంద్రబాబును తక్షణమే ఆస్పత్రిలో చేర్పించి వైద్య చికిత్సలు అందించాలని టిడిపి నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు వినతిపత్రం అందజేశారు. స్పందన వినతులు అందజేయడానికి వచ్చిన వృద్ధునికి విభిన్న ప్రతిభవంతుల శాఖ నుంచి వినికిడి యంత్రాన్ని అందజేశారు.
రీఓపెన్ వినతులపై మరింత శ్రద్ధ
జిల్లాలో రీ ఓపెన్ వినతులు 20 వరకు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని ఆయా అధికారులు తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. జగనన్నకు చెబుదాంలో ఏడు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వి.ఎస్.ఎస్ లకీëప్రసన్న, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి, జెడ్‌పి సిఇఒ ఆర్.వెంకట్రామన్, జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, గృహ నిర్మాణ సంస్థ పథక సంచాలకులు ఎన్.గణపతి పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.