Jul 10,2023 21:07

ధర్నా చేస్తున్న ఎపి రైతుసంఘం నాయకులు, రైతులు

        ప్రజాశక్తి-ఉరవకొండ   పంటలు నష్టపోయిన రైతులందరికీ బీమా ప్రకటించి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చిరుతల మల్లికార్జున డిమాండ్‌ చేశారు. ఈమేరకు సోమవారం పట్టణంలోని తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ఎపి రైతుసంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కురుగుంట మనోహర్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పంటలకూ బీమా వర్తింపజేయాలన్నారు. పంటలు నష్టపోయి అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకునిరెత్తినట్లు వ్యవహరించడం చాలా బాధాకరమన్నారు. తక్షణం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్సిగ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే రైతులు, కౌలు రైతులకు సాగు సాయం కింద ఎకరాకు రూ.10వేలు ఇవ్వాలని, రైతు రుణమాఫీ చేయాలని, కేరళ ప్రభుత్వ తరహాలో రుణ విముక్తి చట్టాన్ని తీసుకుని రావాలని, 50 సంవత్సరాలు పూర్తయిన ప్రతి రైతుకూ రూ.10వేల పింఛన్‌ ఇవ్వాలని, సాగు పట్టాలివ్వడంతోపాటు పాడి పశువులకు బ్యాంకుల్లో 50శాతం సబ్సిడీతో రుణాలివ్వాలన్నారు. 90 శాతం సబ్సిడీతో స్ప్రీంక్లర్లు, డ్రిప్‌లు ఇవ్వాలని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని, డాక్టర్‌ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయా సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎపి రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు బోయ గోపాల్‌, డిహెచ్‌పిఎస్‌ జిల్లా కార్యదర్శి మల్లికార్జున, నియోజకవర్గ నాయకులు సుల్తాన్‌, రమణ, నారాయణమ్మ, వెంకటేష్‌, ప్రసాద్‌, నారాయణప్ప, ఖాసీం, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.