ప్రజాశక్తి-పుట్లూరు అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని ఎపి రైతుసంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కోరారు. ఈమేరకు మండల పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని మంగళవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చిలో కురిసిన భారీ వడగండ్ల వానకు వేలాది ఎకరాల్లో రైతులు పంటలు నష్టపోయారన్నారు. ఎకరాలో అరటి సాగుకు కనీసం రూ.1.30లక్షలు ఖర్చు అవుతుందన్నారు. ఈనేపథ్యంలో ఉల్లి, బొప్పాయి, కలింగర పంటలకు హెక్టారుకు రూ.15వేలు, మామిడి, చీనీ, నిమ్మ, సపోటా, జామ, దానిమ్మ, పంటలకు హెక్టారుకు రూ.25 వేలు, మొక్కజొన్నకు రూ.12,500 నష్టం జరిగినట్లు అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపడి బాధాకరమన్నారు. ఇలా అయితే రైతులు ఎలా వ్యవసాయం చేస్తారన్నారు. కావున బ్యాంకులు నిర్ణయించిన స్కేల్ అప్ ఫైనాన్స్ ఆధారంగా పంట నష్టపరిహారం చెల్లించాలని కోరారు. అంతేగాకుండా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటల నష్టం అంచనా వేసే నిబంధనలను మార్చాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా కౌలు రైతుల పేర్లు ఈక్రాప్ బుకింగ్‌లో లేనందున పంట పెట్టుబడి నష్టపోయిన కౌలు రైతులకు పరిహారం వచ్చే అవకాశం లేకుండా పోతుందన్నారు. అలాగే సాంకేతిక కారణాలతో కొద్దిమంది రైతులు ఈక్రాప్ బుకింగ్ చేయించుకోలేదన్నారు. కావున ఆయా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సూరి, కార్యదర్శి వెంకటచౌదరి, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు పెద్దయ్య, నాయకులు నాగభూషణం, పూలరంగడు, శేఖర్, తదితరులు పాల్గొన్నారు
ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పిస్తున్న రైతుసంఘం నాయకులు










