Aug 21,2023 21:47

సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి.రాంభూపాల్‌

           అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి... ముఖ్యమంత్రి ప్రత్యక్ష్యంగా పరిశీలించి రైతులను ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రాంభూపాల్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక గణేనాయక్‌ భవన్‌లో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఓ.నల్లప్ప అధ్యక్షతన ఆ పార్టీ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం రాంభూపాల్‌ మాట్లాడుతూ పంటల పరిస్థితిపై కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 26వ తేదీ వరకు జిల్లాలో ఎండుతున్న పంట పొలాలను పరిశీలన, 28వ తేదీ జిల్లా కేంద్రంలో రైతు, కూలీలతో చర్చావేదిక, సెప్టెంబర్‌ 1న రైతు భరోసా కేంద్రాల వద్ద నిరసనలు, సెప్టెంబర్‌ 4వ తేదీన మండల కార్యాలయాల వద్ధ ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో సాధారణ సాగు 9.15 లక్షల ఎకరాలు సాగు కావాల్సి ఉండగా, 6 లక్షల ఎకరాల్లోపు మాత్రమే సాగు జరిగిందన్నారు. 4 లక్షల ఎకరాల్లో కనీసం విత్తనం కూడా వేయలేకపోయారని తెలిపారు. 168 మిల్లీమీటర్‌లకు గాను 127 మిల్లీమీటర్‌లు వర్షం మాత్రమే పడిందన్నారు. దీని వల్ల 21 మండలాల్లో వర్షాభావం నెలకొందన్నారు. ఇప్పటికే రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని తెలిపారు. జిల్లా రైతులను ఆదుకునేందుకు పంట వేసి నష్టపోయిన వారికి ఎకరాకు కనీసం రూ. 50 వేలు, పంట సాగు చేయని రైతులకు ఎకరాకు రూ. 30 వేలు, వ్యవసాయ పనులు కోల్పోతున్న కూలీలకు ఉపాధి హామీ పథకం కింద అదనంగా వంద రోజులు పని కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బాలరంగయ్య, బి.శ్రీనివాసులు, వి.సావిత్రి, జిల్లా కమిటి సభ్యులు ఎస్‌.నాగేంద్రకుమార్‌, వి.రామిరెడ్డి, భాస్కర్‌, రామాంజనేయులు, చంద్రశేఖర్‌రెడ్డి, క్రిష్ణమూర్తి, అచ్యుత్‌, మల్లికార్జున, రంగారెడ్డి, జగన్‌, నిర్మల, నాగమణి, వెంకటనారాయణ, ముస్కిన్‌, సూర్యచంద్ర యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.