చెప్పింది 9... ఇస్తున్నది 7 గంటలే..
వేళాపాళా లేకుండా విద్యుత్ కట్
ప్రజాశక్తి-చిత్తూరు ప్రతినిధి
వ్యవసాయానికి నిరంతరాయంగా 9గంటలు విద్యుత్తు ఇస్తున్నామని వైసీపీ ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటోంది. కరెంటు కోతలని రాస్తే కేసులు నమోదు చేస్తామని ఇటీవల అధికారులు మీడియాను హెచ్చరించారు కూడా. అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా కరెంటు కోతలతో జనం అల్లాడుతున్నారు. ముఖ్యంగా పల్లెల్లో రైతుల బాధలు అన్నీ ఇన్నీ కావు. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో అర్థం కాక వారు తలలు పట్టుకుంటున్నారు.
చేతికాడికొచ్చిన పంటను కాపాడుకోవాలనే ప్రయత్నం మరోపక్క.. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని విద్యుత్‌తో రైతులు పొలం వద్దనే పడిగాపులు కాస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో తిరుపతి, తిరుపతి రూరల్, పుత్తూరు, చిత్తూరు, చిత్తూరు రురల్, మదనపల్లి, పీలేరు విద్యుత్ సబ్ డివిజన్లు ఉన్నాయి. గహ, పరిశ్రమ, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి 18,58,550 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 2,98,234 ఉన్నాయి. జిల్లాలో గత ఏప్రిల్ నెల నుండి ఫిబ్రవరి నెల వరకు 5859.12 మిలియన్ యూనిట్లు వాడారు.
వ్యవసాయానికి 9 గంటల నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే కరెంట్ ఎప్పుడొస్తుందో ఎప్పుడు రాదో అన్న పరిస్థితి నెలకొంది. వేకువ జాము నుంచి పొలం వద్ద పడిగాపులు కాస్తున్నారు. వ్యవసాయానికి ఇస్తున్న విద్యుత్ సరఫరాలో విడతల వారీగా గంట నుంచి మూడు గంటల పాటు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. కరెంట్ ఎప్పుడు వస్తుంది అని రైతులు సబ్‌స్టేషన్‌కు ఫోన్ చేస్తే... కొన్ని చోట్ల లోడ్ రిలీఫ్ అని చెబుతుండగా, మరికొన్ని చోట్ల విజయవాడ నుంచే కట్ చేస్తున్నట్లు చెబుతున్నారని రైతులు చెబుతున్నారు. జిల్లాలో1,77,075 హెక్టార్లలో వివిధ రకాల పంటలు ఉన్నాయి. మామిడి పంట కోత దశకు చేరుకున్నాయి. కాయలు కోతకు వచ్చేంత వరకు నీరు అవసరం. వీటికి ఇప్పుడు నీటి తడులు అవసరం. ఎండలు విపరీతంగా ఉండడంతో పంట చేతికి రావాలంటే నీరు అందించాల్సి ఉంది. వ్యవసాయానికి 9 గంటలు కరెంటు ఇస్తామని చెబుతున్నప్పటికీ కనీసం ఏకదాటిగా మూడు నుంచి నాలుగు గంటలు కూడా అందని పరిస్థితి. గతంలో ఉదయం ఐదు నుండి పది గంటల వరకు, మళ్లి మధ్యాహ్నం రెండు నుండి ఆరు వరకు ఇచ్చేవారు. ఇంకో షిఫ్ట్ కింద ఉదయం ఉదయం ఆరు నుండి ఒంటి గంట వరకు, మళ్ళి మధ్యాహ్నం రెండు నుండి ఆరు
వరకు ఇచ్చేవారు. ఇప్పుడు ఉదయం 4 నుండి 11 వరకు 7 గంటలు మాత్రమే ఇస్తున్నారు. అది కూడా 15 - 20 నిమిషాల లేటుగా వస్తుంది. మధ్యలో 15 -20 నిమిషాల కట్. ఇలా 9 గంటల హామీ గాలిలో కలిసి పోయింది. 6 నుండి 7 గంటలు మాత్రమే రైతులకు కరెంట్ ఇస్తున్నారు. కరెంట్ పోతే గంటకొస్తాదో, రెండు గంటలకు వస్తాదో తెలియక రైతులు నిద్రాహారాలు మానుకుని పొలం వద్దే కరెంట్ కోసం పడిగాపులు కాస్తున్నారు. మలమల మాడ్చే ఎండలో చెమటలు కక్కుతూ అష్టకష్టాలు పడుతున్నారు.










