పంటలపై గజదాడులు
ఆందోళనలో రైతన్నలు
ప్రజాశక్తి- సోమల :
మండలంలోని అన్నెమ్మ గారిపల్లి, పేటూరు పంచాయతీల పరిధిలోని అటవీ సమీప వ్యవసాయ పొలాలపై ఏనుగుల దాడులు కొనసాగుతున్నాయి. టమోటా, కొబ్బరి అరటి, చెరకు, వరి, మామిడి తదితర పంటలపై ఏనుగులు దాడులు చేస్తూ పంటలను పొలాలలోని వ్యవసాయ పరికరాలను ధ్వంసం చేస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఏనుగుల దాడులు జరుగుతున్న అటవీశాఖ నామమాత్రపు చర్యలు చేపడుతూ శాశ్విత పరిష్కార మార్గాలను చూపించడం లేదని రైతులు వాపోతున్నారు. రాత్రి వేళల్లో పొలాల వద్దకు వెళ్లాలంటేనే భయం వేస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలను ఏనుగులు ధ్వంసం చేస్తుంటే నష్టాలపాలు కావలసి వస్తుందని జిల్లాస్థాయి అటవీశాఖ అధికారులు పూర్తిస్థాయిలో రైతుల పరిస్థితిని అర్థం చేసుకొని ఏనుగుల భారీ నుండి కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులు వాపోతున్నారు. ఆదివారం రాత్రి చిట్టి, పురుషోత్తం, ప్రసాద్ తదితర రైతులకు చెందిన కొబ్బరి చెట్లను, టమోటా పంటను తొక్కివేసి, మామిడి కొమ్మలను విరిచివేశారని పూర్తిగా నష్టం కలిగించాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏనుగుల వారి నుండి రైతులను కాపాడేందుకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని రైతును డిమాండ్ చేస్తున్నారు.
పలమనేరు: పలమనేరు రూరల్‌లోని పెంగరగుంట గ్రామసమీపానగల కొత్తచెరువులో సోమవారం ఉదయం 6గంటల వరకూ కూడా పంట పొలాలపై నాలుగు ఏనుగులు దాడులు కొనసాగిస్తూ రైతులను భయబ్రాంతులకు గురిచేశాయి. ఈమధ్యకాలంలో కొత్తగా ఇంధ్రానగర్ నుండి పెంగరగుంట గ్రామం వరకు రెండు కిలోమీటర్ల వరకు సోలార్ కంచె పనులు చేపట్టారు. అయితే ఈ పనులు ఇంకా పెండింగు ఉన్న ప్రాంతాల్లో ఏనుగులు ప్రవేశించి సమీపంలోని పెంగరగుంట, చిన్నకుంట, మొసలిమడుగు గ్రామాలలో దాడులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం రాత్రి 10 గంటలకు మొసలిమడుగు గ్రామసమీపంలోని పంట పొలాలపై ప్రవేశించి కొంతమంది రైతులకు చెందిన అరటి తోటలు, పశుగ్రాసం ధ్వంసం చేస్తుండగా రైతులు గమనించి అక్కడి నుంచి అడవిలోకి మళ్ళించారు. ఏనుగులు కొత్తచెరువుకు ఆనుకొని కొంతదూరం వరకూ చేపట్టిన సోలార్ కంచెను ఆనుకుని వెళ్ళి కంచె లేనిచోట అడవిలోనికి వెళ్ళిపొయాయి. ఈవిధంగా ప్రతిరోజూ సమీప గ్రామల్లో ఏనుగులు దాడులు కొనసాగుతూ రైతులను భయబ్రాంతులకు గురిచేస్తూ ప్రస్తుతం కాస్తోకూస్తో ఉన్న పంటలను నష్టపరుస్తూనేవున్నాయి. ప్రభుత్వం స్పందించి పెండింగులో ఉన్న ప్రాంతాల్లో కూడా వెంటనే సోలార్ కంచెను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.










