ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం అన్ని పంటలకు మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించేందుకు పార్లమెంట్‌లో చట్టం తీసుకురావాలని ఎపి రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈనెల 5న ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనకు సోమవారం జిల్లా నుంచి రైతుసంఘం నాయకులు, రైతలు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురము జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, తుంగభద్ర ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు ఉన్న సాగునీటి హక్కులను కాపాడాలని, హంద్రీనీవాను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని, పిఎం కిసాన్ సన్మాన్ ద్వారా జిల్లాలో డ్రిప్, స్పింక్లర్లను ఉచితంగా అందజేయాలని, పండ్లతోటలకు అనుబంధంగా జ్యూస్ ఫ్యాక్టరీలు ఏర్వాటు చేయాలని, వ్యవసాయ రంగానికి ఎరువుల సబ్సిడీలు పెంచాలని, విద్యుత్ సవరణ బిల్లు-2022ను ఉపసంహారించుకోవాలని, అనంతపురం పేద, మధ్యతరగతి రైతులకు నెలకు రూ.5వేలు పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 5వ తేదీన ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో రైతాంగ ఉద్యమ ఫలితంగా మద్దతు ధర గ్యారెంటీ చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చి మోడీ ప్రభుత్వం తర్వాత విస్మరించిందన్నారు. కార్పొరేట్ కంపెనీలకు వేలకోట్లు రుణమాఫీలు చేస్తున్న కేంద్రం రైతుల రుణాలు ఎందుకు మాఫీ చేయడం లేదని ప్రశ్నించారు. సేంద్రీయ వ్యవసాయం, చిరుధాన్యాల వ్యవసాయం చేసే రైతులకు ప్రోత్సాహకులు అందిస్తామని చెబుతూనే వ్యవసాయం మార్కెట్ కార్పొరేట్ కంపెనీల మార్కెట్‌గా మార్చేసి కార్పొరేట్ వ్యవసాయానికి కేంద్ర ప్రభుత్వం బాటలు వేసిందన్నారు. అలాగే సన్న, చిన్న కారు, పేద, కౌలు రైతుల సంక్షేమానికి సహకార సొసైటీలను డిజిటలైజేషన్ చేస్తామని, గోడౌన్స్ నిర్మిస్తామని చెబుతూనే మరోవైపు సహకారంగాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. మరోవైపు ఉపాధి పథకం నిధులు కోత పెట్టడం తగదన్నారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఢిల్లీకి తరలిన వారిలో ఎపి రైతుసంఘం జిల్లా ఆధ్యక్షులు తరిమెల నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు మధుసూదన్, రాజారామిరెడ్డి, విటి రామాంజినేయులు, రాయుడు, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాసులు, చెన్నారెడ్డి, పోతలయ్య, వెంకటకొండ నారాయణరెడ్డి, నాగమ్మ, చిదంబరమ్మ, రైతులు జయశేఖర్, రమేష్, పార్వతి, సుభద్రమ్మ, రామాంజి, సురేష్, తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీకి వెళ్తూ రైల్వేస్టేషన్‌లో ఉన్న ఎపి రైతుసంఘం నాయకులు, రైతులు










