Apr 15,2023 22:20

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయ అధికారి బి.చంద్రానాయక్‌

       ప్రజాశక్తి-అనంతపురం   రైతులు సాగు చేసిన పంటలకు అధిక దిగుబడులు సాధించాలంతే భూసార పరీక్షలు చాలా కీలకమని జిల్లా వ్యవసాయ అధికారి బి.చంద్రానాయక్‌ అన్నారు. శనివారం స్థానిక అనంత కృషి భవనంలో మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వరప్రసాద్‌ అధ్యక్షతన అనంతపురం రూరల్‌ మండల వ్యవసాయ సలహా మండలి సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజన్‌లో పంటల సాగుకు ముందు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా ఆర్‌బికె సిబ్బందికి మట్టి నమూనాల సేకరణపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. రైతు పొలం నుంచి సేకరించిన మట్టిని వివిధ భౌతిక, రసాయన పద్ధతుల ద్వారా విశ్లేషించి ఎంత మోతాదులో ఎరువులు వాడాలో తెలుసుకోవడమే భూసార పరీక్ష ముఖ్య ఉద్దేశమన్నారు. భూమి స్వభావాన్ని తెలుసుకుని ఎరువులు వాడితే ఎక్కువ దిగుబడులు సాధించవచ్చన్నారు. అంతేగాకుండా ఏఏ పంటలు పండిచవచ్చో కూడా తెలుసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు ఆలమూరు సుబ్బారెడ్డి, ఎఆర్‌ఎస్‌ రేకులకుంట శాస్త్రవేత్త వెంకటరమణ, మండల వ్యవసాయ సలహా మండలి, ఎఇఒలు ప్రసాద్‌, మురళి, శిరీషా, సుజిత, ఆర్‌బికె అధికారులు, రైతులు పాల్గొన్నారు.