బొమ్మనహాల్ : ఉమ్మడి అనంతపురం జిల్లాను ఈ ఏడాది కరువు కమ్మేసింది. కనీసం విత్తనాలు వేసుకునేందుకు కూడా వర్షాలు పడలేదు. పడిన కొద్దిపాటి వర్షానికి వేసిన పంట కూడా వర్షం లేకపోవడంతో ఎండుదశకు చేరుకుంటోంది. దీనిని కాపాడుకునేందుకు రైతులు నానావస్థలు పడుతున్నారు. కళ్లేదుటే వాడిపోతున్న మొక్కలను కాపాడుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. వర్షం జాడలేకపోవడంతో పంటకు తడి అందిచడం కష్టమై రైతుల కంట కన్నీటి సుడులు తిరుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో కరువు ఎంతలా కరాళనృత్యం చేస్తోంది అన్న దానికి బొమ్మనహల్ మండలం బొల్లనగుడ్డం గ్రామంలో రైతులు పడుతున్న ఇబ్బందులు అద్దం పడుతున్నాయి. హెచ్‌ఎల్‌సికి సాగునీరు అందక దాని పరిసర ప్రాంతంలో సాగు చేసిన మిరప చెట్లు ఎండిపోతున్నాయి. వీటిని కాపాడుకోవడానికి ఒక్కొక్క చెట్టుకు ఒక లీటర్ నీళ్లు డబ్బాలతో తెచ్చి మరీ రైతులు పోస్తున్నారు. ఒక్కో చెట్టు వద్దకెళ్లి డబ్బాతో నీళ్లు పోసి ఆ మొక్కలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిసర ప్రాంతంలో చాలా మంది రైతులు ఇలానే చేస్తూ పంటను కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. హెచ్‌ఎల్‌సి కాలువ నుంచి తొమ్మిదవ డిస్ట్రిబ్యూటరీ చివరి ఆయకట్టుకు 2600 ఎకరాలు సాగుభూమి ఉంది. ఇందులో ఇప్పటి వరకు ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందించలేదు. దీనికి తోడు వర్షం కూడా పడలేదు. గత నెలలో కురిసిన కొద్దిపాటి వర్షానికి రైతులు మిరప విత్తనాలు నాటారు. అవి మొలకెత్తాయి. అప్పటినుంచి ఇప్పటివరకు వర్షం రాలేదు.. సాగునీరూ వదల్లేదు. కళ్లేదుటే పంట ఎండిపోతుండడాన్ని తట్టుకోలేక రైతులు కుటుంబ సభ్యులతో కలిసి డబ్బాలతో నీరు పోసే పనికి సిద్ధం అయ్యారు. ప్రతి రైతూ నలుగురు కూలీలు, ఎద్దులు బండిలో డ్రమ్ముల ద్వారా నీటిని తీసుకెళ్లి చెట్లకు నీరు పోసే పనులు చేస్తున్నారు. ఒక మొక్కకు ఒక లీటర్ వంతున నీరువేస్తూ వాటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఖర్చుతో కూడుకున్న పని అయినా ఇంతకంటే వేరేదారిలేక తమ శక్తినంతా దారిపోసి మొక్కలను కాపాడే ప్రయత్నం చేస్తున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంటను కాపాడుకోవాలని..
మారన్న, రైతు,
బొల్లనగుడ్డం గ్రామం.
గత నెలలో వచ్చిన కొద్దిపాటి వర్షానికి హెచ్‌ఎల్సీ కింద రెండు ఎకరాల్లో మిరప పంటను సాగు చేశాను. విత్తనం వేసినప్పటి నుంచి వర్షం రాలేదు. హెచ్‌ఎల్సీకి సాగు నీరు కూడా వదల్లేదు. దీంతో పంటలు ఎండుదశకు చేరుకున్నాయి. చేసేది లేక ప్రతి రోజూ కూలీలను తీసుకొచ్చి డబ్బాలతో మొక్కలకు నీరు పోయిస్తున్నాను. అధికారులు సాగునీటి విడుదలపై స్పష్టతను ఇవ్వడం లేదు. పరిస్థితి ఇలానే ఉంటే ఈ ప్రాంతంలో రైతులు తీవ్రంగా నష్టపోతారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సాగునీటి విడుదలకు చర్యలు తీసుకోవాలి.
తగినంత సాగునీరు లేదు
మద్దిలేటి, హెచ్‌ఎల్‌సి, డిఇ.
హెచ్‌ఎల్సీకి ప్రస్తుతం తగినంత సాగునీరు లేదు. దీంతో ఉన్నతాధికారులు సాగునీటిని విడుదల చేయడం లేదు. వర్షం లోటు కూడా ఉండడంతో కొంత రైతులకు ఇబ్బంది ఉంది. నీటి లభ్యత మొదలవ్వగానే సాగునీటిని విడుదల చేస్తాం.










