May 16,2023 22:17

మృతి చెందిన రైతు వెంకటరామిరెడ్డి (ఫైల్‌ ఫొటో)

          పుట్లూరు : పంట రుణాలు రెన్యూవల్‌ చేసేందుకు వెళ్లిన ఓ రైతు బ్యాంకు ఆవరణంలోనే గుండె ఆగి మృతి చెందాడు. మండుటెండలో కనీసం నిల్చోనేందుకు కూడా నీడ ఏర్పాటు చేయని పరిస్థితుల్లో ఎండ వేడిమి, ఉక్కపోత తాళలేక ఆ రైతు మరణించాడు. అనంతపురం జిల్లా పుట్లూరు మండల కేంద్రంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో మంగళవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... పుట్లూరు మండలం శనగలగూడూరు గ్రామానికి చెందిన రైతు వెంకటరామిరెడ్డి(70) అనంతగ్రామీణ బ్యాంకులో పంట రుణం తీసుకున్నాడు. ఈ రుణం రెన్యువల్‌ చేసేందుకు ఉదయం బ్యాంకు వద్దకు వచ్చాడు. అప్పటికే తీవ్రమైన ఎండ, ఉక్కపోత ఉండడంతో రెన్యువల్‌ చేసేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఇలా ఇబ్బంది పడుతూనే క్యూలైన్లో నిల్చొని పంట రుణం రెన్యువల్‌కు సంబంధించిన సంతకాలను పూర్తి చేశాడు. బ్యాంకు నుంచి బయటకు రాగానే ఒక్కసారిగా సృహతప్పి కిందపడ్డాడు. తోటి రైతులు గుర్తించి ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు మృతి చెందాడు. ఎండవేడిమి, గుండెపోటుతో రైతు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పంట రుణం రెన్యువల్‌కు వచ్చి మృతి చెందిన రైతుకుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రైతుసంగం నాయకులు డిమాండ్‌ చేశారు. మృతిని కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.