పంట పొలాలపై 'గజ' దాడులు
ప్రజాశక్తి- బైరెడ్డిపల్లి
మండలంలోని వెంగమారిపల్లి పంచాయతీ కడతట్లపల్లి గ్రామంలోని పంటలపై ఏనుగులు దాడి చేసి నాశనం చేసిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. బాధిత రైతు సుబ్రమణ్యం తెలిపిన వివరాల మేరకు.. ఓ ఏనుగుల గుంపు సోమవారం అర్థరాత్రి రెండు ఎకరాల వరి పంటను తిని తొక్కి నాశనం చేశారు. అప్పులు చేసి పండిన పంట ఏనుగుల పాలైందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా తరచూ ఏనుగులు పంట పొలాలపై దాడి చేస్తున్నాయని, చేతికొచ్చిన పంటను నాశనం చేస్తున్నాయని అటవీశాఖ అధికారులకు పలుమార్లు తెలిపిన పట్టించుకోవడం లేదని వాపోయారు. జిల్లా కలెక్టర్ స్పందించి నష్టపోయిన తమకు తగు పరిహారం ఇప్పించాలని విన్నవించుకున్నారు. అలాగే అటవీశాఖ అధికారులు ఏనుగుల రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.










