Apr 03,2023 22:11

శింగనమల డిప్యూటీ తహశీల్దార్‌ ప్రకాష్‌రావుకు వినతిపత్రం సమర్పిస్తున్న సిపిఎం నాయకులు

         ప్రజాశక్తి-శింగనమల   అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించి ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి భాస్కర్‌ డిమాండ్‌ చేశారు ఈమేరకు శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్‌ ప్రకాష్‌రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పరిహారం చెల్లించాలన్నారు. జిల్లావ్యాప్తంగా 16 మండలాల్లోని 46 గ్రామాల్లో 4843 ఎకరాల్లో ఉద్యానవన పంటలు నాశనం అయ్యాయన్నారు. వీటిలో శింగనమల మండలంలో కూడా అధిక శాతం పంటలకు నష్టం సంభవించిందన్నారు. ముఖ్యంగా మామిడి, నిమ్మ, చీనీ వంటి పంటలు తోటల్లోనే కాయలు రాలిపోయి తీవ్రంగా రైతులు నష్టపోయారన్నారు. అలాగే మిర్చి పంట కోసిన తర్వాత కళ్లాల్లో ఉన్న పంట నాశనమైందన్నారు.కౌలు రైతుల పేర్లు ఈక్రా బుకింగ్‌లో లేనందువల్ల పెట్టుబడులు పెట్టి నష్టపోయారన్నారు. కావున రైతులందరికీ బ్యాంకుల్లో నిర్ణయించిన స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఆధారంగా పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో రైతు సంఘం మండల కార్యదర్శి లక్ష్మీనారాయణరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి సుంకన్న, ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి సూర్యప్రకాష్‌, సిఐటియు మండల కార్యదర్శి గంప మల్లయ్య, నాయకులు శివ, మల్లయ్య, మల్లప్ప, తదితరులు పాల్గొన్నారు.
గుత్తి : అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పరిహారం చెల్లించాలని సిపిఎం, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు సోమవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో ఉప తహశీల్దార్‌ శ్రీలతకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి బి.రామకృష్ణ, సిఐటియు మండల అధ్యక్షులు ఎం.మల్లేష్‌ మాట్లాడుతూ గతనెలలో ఈదురుగాలులు, వడగండ్ల వర్షాలతో జిల్లావ్యాప్తంగా ఉద్యానవన పంటలతోపాటు ఇతర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పంట నష్టాన్ని సక్రమంగా అంచనా వేసి రైతులకు పరిహారం అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ మండల కార్యదర్శి యు.మల్లికార్జున, ఐద్వా మండల అధ్యక్షురాలు కవిత, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రమేష్‌, గౌతమ్‌నాయక్‌, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.