ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్ గత ఖరీఫ్, ప్రస్తుత రబీ సీజన్‌లలో అధిక, అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులందరికీ బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని గణేనాయక్ భవన్‌లో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.బాల రంగయ్య అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఈనెల 15న జిల్లాలోని అన్ని తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గత ఖరీఫ్‌లో అతివృష్టి, అనావృష్టి వల్ల వేరుశనగ, కంది, పత్తి, మిరప, పండ్ల తోటలు పూర్తిగా దెబ్బ తిన్నాయన్నారు. రైతులు అప్పులు చేసి పంటలు సాగు చేస్తే పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు అధికంగా రావడంతో పొలాల్లోనే వేరుశనగ, ఇతర పంటలు మొలకలు వచ్చి కుళ్లిపోయాయని తెలిపారు. పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాకపోవడంతో చేసిన అప్పులు చెల్లించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంన్నారని తెలిపారు. ఐదునెలల్లో 21 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. పంట పెట్టుబడులకు అప్పులు పుట్టే పరిస్థితి లేకపోవడంతో ప్రయివేట్ వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలకు రైతులను దోచుకుంటున్నారని వాపోయారు. కావున గత ఖరీఫ్, రబీలలో అకాల వర్షాలు, వండగండ్ల వానలతో నష్టపోయిన వేరుశనగ, పత్తి, కంది, మిరప, మొక్కజొన్న, అరటి, చీనీ, తమలపాకులు, టమోటా, బొప్పాయి తదితర పంటలకు పంట నష్టపరిహారం, పంట పెట్టుబడి సహాయం ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పనులు వద్ద కనీస సౌకర్యాలు టెంట్లు, మెడికల్ కిట్, మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఏర్పాటు చేయాలని కోరారు. పాత పద్ధతుల్లోనే పనులు కల్పించాలన్నారు. పే స్లిప్పులు ఇవ్వాలని, మేట్లకు పారితోషికం ఇవ్వాలని కోరారు. ఆయా సమస్యల పరిష్కారానికి ఈనెల 15న తహశీల్దార్ కార్యాలయాల ఎదుట నిర్వహించనున్న ధర్నాలకు రైతులు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఓ.నల్లప్ప, వి.సావిత్రి, జిల్లా కమిటి సభ్యులు ఎం.క్రిష్ణమూర్తి, ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి, రామాంజనేయులు, భాస్కర్, నాగమణి, నిర్మల, అచ్యుత్, సూర్యచంద్రయాదవ్, ముస్కిన్, వెంకటనారాయణ, రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
విలేకరులతో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్










