అకాల వర్షాలకు పొగాకు, మొక్కజొన్న, మామిడి, నిమ్మ, అరటి పంటలకు తీవ్ర నష్టం
ఇప్పటికీ ప్రాథమిక అంచనాలతోనే సరి
దెబ్బతిన్న పంటల లెక్కలపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి
నష్టం అంచనా పూర్తి ఎప్పటికో
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈదురుగాలులు, వడగాళ్ల వాన రైతులను అతలాకుతలం చేసింది. పామాయిల్, నిమ్మ చెట్లు వేళ్లతో సహా కూలిపోయిన పరిస్థితి నెలకొంది. పొగాకు, మొక్కజొన్న, మామిడి, నిమ్మ, అరటి, కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టిన రైతులు లబోదిబోమంటున్నారు. దెబ్బతిన్న పంటలకు సంబంధించి అధికారులు ప్రాథమిక అంచనాలు రూపొందించారు. ఎన్యుమరేషన్ పూర్తి చేసి రైతులకు త్వరితగతిన పరిహారం అందించాల్సి ఉన్నప్పటికీ మందకొడిగా సాగుతుందనే విమర్శలు విన్పిస్తున్నాయి. అధికారులు చెబుతున్న ప్రాథమిక అంచనాలపై రైతులు తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాగు చేసిన పంటలో 33 శాతం దెబ్బతింటేనే నష్టం జాబితాలో చేరుస్తామంటున్నారని, దీంతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారనుందని రైతులు చెప్పుకొస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం నిమ్మ, పామాయిల్, అరటి వంటి ఉద్యాన పంటలు జిల్లాలో 320 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా వేశారు. సాధారణ పంటలకు వచ్చేసరికి పొగాకు, మినుము, వరి, వేరుశెనగ, మిర్చి వంటి పంటలు 955 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు చెప్పుకొస్తున్నారు. అకాల వర్షాలకు పెద్దఎత్తున దెబ్బతిన్న పంటల్లో పొగాకు అత్యధికంగా ఉంది. అధికారుల లెక్కల ప్రకారం 497 ఎకరాల్లో పొగాకు దెబ్బతిన్నట్లుగా చెబుతుండగా ఒక్క జీలుగుమిల్లి మండలంలోనే పొగాకు పంట నష్టం పెద్దఎత్తున ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. ఈ మండలంలో వడగళ్ల వానకు ఒక్క గ్రామంలోనే 150 ఎకరాలకుపైగా పొగాకు పంట దెబ్బతిన్నట్లు రైతులు చెబుతున్నారు. మెట్ట ప్రాంతంలో పొగాకు పంట వేలాది ఎకరాల్లో సాగైంది. పంటనష్టం పెద్దఎత్తున జరిగినట్లు రైతులు చెబుతున్నా అధికారుల లెక్కలు మాత్రం నామమాత్రంగా ఉన్నాయి. 33 శాతం నిబంధన పేరిట దెబ్బతిన్న పొలాలను సైతం లెక్కల నుంచి పక్కన పెడుతున్నట్లు తెలుస్తోంది. నిమ్మచెట్లు ఈదురుగాలులకు వేళ్లతో సహాలేచి కుప్పకూలాయి. పెద్దఎత్తున కూలిన తోటలనే లెక్కల్లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పంటనష్టం అంచనాలకు సంబంధించి పూర్తిస్థాయిలో జరగాల్సి ఉంది. పంట నష్టం నమోదు ప్రక్రియ ప్రారంభించినట్లు చెబుతున్నా చురుగ్గా సాగుతున్న దాఖలాల్లేవు. పంటనష్టం అంచనాలపై నిబంధనలు సడలించి రైతులకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. మొక్కజొన్న రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందని అంతా లబోదిబోమంటున్నారు. పంట నష్టం అంచనాలన్నీ గోల్‌మాల్‌గా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంటనష్టం ప్రాథమిక అంచనాలపై వ్యవసాయాధికారులు కనీసంగా ప్రకటన చేయని పరిస్థితి జిల్లాలో నెలకొంది. పంటనష్టంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే చర్చ రైతుల్లో సాగుతోంది. దెబ్బతిన్న పంటను లెక్కించి పరిహారం త్వరితగతిన అందించేలా చూడాలని రైతులు కోరుతున్నారు. పంటనష్టానికి ఇచ్చే పరిహారంపైనా రైతుల్లో తీవ్ర చర్చ సాగుతోంది. పెట్టుబడులు తక్కువగా ఉన్న కాలంలో చేపట్టిన లెక్కల ప్రకారమే పరిహారం ఇస్తుండటంపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పెట్టుబడులు భారీగా పెరిగిన నేపథ్యంలో పంట నష్టపరిహారం సైతం పెంచాలని రైతులు కోరుతున్నారు.
నిబంధనలు సడలించి రైతులకు న్యాయం చేయాలి
కె.శ్రీనివాస్, రైతుసంఘం జిల్లా కార్యదర్శి
అకాల వర్షం, వడగళ్ల వానలకు తీవ్ర పంట నష్టం వాటిల్లింది. నిబంధనల పేరుతో నష్టం అంచనాలను తక్కువ చేసి చూపిస్తున్నారు. ఉద్యాన, ఆహార పంటలు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. పంటనష్టం అంచనాల్లో 33 శాతం నిబంధనను సడలించి పంటనష్టం నమోదు చేయాలి. ఎంతమేర పంటనష్టం జరిగితే అదేవిధంగా నష్టం నమోదు జరగాలి. వెంటనే ఎన్యుమరేషన్ పూర్తిచేసి పరిహారం అందించి రైతులను ఆదుకోవాలి.
నిబంధనలు సడలించి రైతులకు న్యాయం చేయాలి
ఆకుల హరేరాం, రైతుసంఘం జిల్లా కార్యదర్శి
అకాల వర్షాల వల్ల తీవ్ర పంట నష్టం వాటిల్లింది. నిబంధనల పేరుతో నష్టం అంచనాలను తక్కువ చేసి చూపిస్తున్నారు. పంటనష్టం అంచనాల్లో 33 శాతం నిబంధనను సడలించి పంటనష్టం నమోదు చేయాలి. ఎంతమేర పంటనష్టం జరిగితే అదేవిధంగా నష్టం నమోదు జరగాలి. వెంటనే ఎన్యుమరేషన్ పూర్తిచేసి పరిహారం అందించి రైతులను ఆదుకోవాలి.










