Apr 25,2023 08:23

పంచాయతీరాజ్‌ దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి

           అనంతపురం కలెక్టరేట్‌ : అభివద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వాలు ఇచ్చే నిధుల మీద ఆధారపడుతున్న గ్రామాలు సొంతంగా ఆదాయం సమకూర్చుకుని సంపద సష్టించే స్థాయికి ఎదగాలని కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి ఆకాంక్షించారు. సోమవారం ఉదయం స్థానిక జెడ్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన పంచాయతీ రాజ్‌ దినోత్సవ వేడుకల్లో జెడ్పీ ఛైర్మన్‌ బోయ గిరిజమ్మతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామంలో సమస్య ఉంటే మండలానికో, జిల్లా కేంద్రానికో వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామ స్థాయిలోనే సమస్య పరిష్కారం అయ్యే విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు అయ్యిందన్నారు. గ్రామ స్థాయిలో కార్యక్రమాలకు స్థానిక పంచాయితీ ఆదాయం నుంచి నుంచి ఖర్చు చేసే రోజులు రావాలన్నారు. జెడ్పీ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ 73వ రాజ్యాంగ సవరణ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పంచాయతీల ఏర్పాటుకు చట్టబద్ధత తీసుకువచ్చి మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి నాంది పలికిందన్నారు. గ్రామాలు, మండలాలు, జిల్లాలు అని తేడా లేకుండా అన్ని స్థాయిలోనూ అభివద్ది జరిగినప్పుడే దేశం అభివద్ధి చెందుతుందన్నారు. అనంతరం పంచాయతీ రాజ్‌ దినోత్సవం సందర్భంగా 9 కేటగిరీల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన గ్రామ పంచాయతీలకు జిల్లా కలెక్టర్‌, జెడ్పీ చైర్‌ పర్సన్‌ లు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో భాస్కర్‌ రెడ్డి, డీఆర్డీఏ పీడీ నరసింహా రెడ్డి, డీపీవో ప్రభాకర్‌ రావు, పంచాయతీ రాజ్‌ ఎస్‌ఈ భాగ్యరాజ్‌, సర్పంచులు పాల్గొన్నారు.