ప్రజాశక్తి - వీరవాసరం
వీరవాసరం మండలంలో గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన 14, 15 ఆర్థిక సంఘం నిధులు వెంటనే ఇవ్వాలని లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వంపై దశలవారీ పోరాటాం చేస్తామని అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం హెచ్చరించింది. వీరవాసరంలో అఖిల పక్ష రౌండుటేబుల్ సమావేశం సిపిఎం నాయకులు జుత్తిగ నరసింహమూర్తి అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. పంచాయతీలో నిధులు లేక అధికార పక్ష సర్పంచులే చెప్పుతో కొట్టుకోవాల్సిన పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందన్నారు. స్థానిక సంస్థల అధికారాన్ని, నిధులను నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళితే సహించేదిలేదని ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని నాయకులు స్పష్టం చేశారు. పంచాయతీ నిధుల సమస్యపై సిపిఎం ఆధ్వర్యంలో ఈనెల 8న చేపట్టిన ఒక్క రోజు శాంతియుత దీక్షను ప్రభుత్వం పోలీసులతో భగం చేయించడాన్ని సమావేశం ఖండించింది. పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడం వల్ల పంచాయతీలను కేంద్ర ప్రభుత్వం బ్లాక్‌లిస్టులో పెట్టడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఐదో ఆర్థిక సంఘం ఏర్పాటు చేయకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఆర్థిక సంఘం నిధులు ఇవ్వలేమని చెప్పటం బాధాకరమన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వకపోయినా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులు వాడుకోవడాన్ని సర్పంచులు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణం రూ.7659 కోట్ల నిధులను పంచాయతీ ఖాతాల్లో జమచేయాలని సమావేశం డిమాండ్ చేసింది. పంచాయతీల్లో నిధుల్లేక ఏ పనీ చేయలేకపోతున్నామని, కనీసం శానిటేషన్, ముగ్గు చల్లించేందుకు డబ్బులు లేని పరిస్థితులున్నాయని పలువురు సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు జమ చేయాలని సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో జనసేన మండలాధ్యక్షుడు గుండా రామకృష్ణ, టిడిపి మాజీ ఎంపిపి వీరవల్లి చంద్రశేఖర్, సర్పంచులు వేండ్ర లీలాకృష్ణ, యర్రంశెట్టి నాగసాయి, ఎంపిటిసిలు గోడి ఆదిలక్ష్మి, వాసాల వెంకటేశ్వరరావు, సిపిఎం నాయకులు రెడ్డి రామారావు, బొంతు రామారావు, గొట్టుముక్కల శ్యాంబాబు పాల్గొన్నారు.










