అనంతపురం ప్రతినిధి : గ్రామం పంచాయతీల్లో జరిగిన ఉపఎన్నికల్లో అధికార వైసిపికి ప్రతిపక్ష టిడిపి గట్టిపోటీనే ఇచ్చింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు సర్పంచి స్థానాలకు, 24 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇందులో సర్పంచి స్థానాల్లో ఒకటి అధికార వైసిపి మద్దతుదారులు విజయం సాధించగా, మరొకటి టిడిపి మద్దతుదారులు విజయం సాధించారు. వార్డుల్లో 13 వార్డుల్లో వైసిపి మద్దతుదారులు గెలుపొందారు. 11 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. రెండు జిల్లాల్లోనూ పంచాయతీ ఉప ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా సాగాయి.
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా శనివారం నాడు జరిగిన పంచాయతీ వార్డు ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పలు పంచాయతీల పరిధిలో వివిధ కారణాలతో ఉప ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 61 వార్డులు, మూడు సర్పంచి స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 37 వార్డులు, ఒక సర్పంచి స్థానం ఏకగ్రీవం అయ్యింది. మిగిలిన 24 వార్డులు, రెండు సర్పంచి స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. మధ్యహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి తుది ఫలితాలను అధికారులు వెల్లడించారు. ఎన్నికల జరుగుతున్న ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రత్యేక బలగాలతో బందోబస్తు నిర్వహించారు.
సర్పంచులు చెరొకటి
సత్యసాయి జిల్లాలోని హిందూపురం మండలంలోని చలివెందుల గ్రామ పంచాయతీ సర్పంచి ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికను అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి రెండూ ప్రతిష్టాత్మకంగానే తీసుకుని ప్రచారం చేశాయి. ఇక్కడ వైసిపి మద్దతుదారుడు ఉపేంద్రకుమార్‌రెడ్డి 337 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అంతకు మునుపు గ్రామ సర్పంచిగా ఉపేంద్ర తల్లి ఉండేది. ఆమె మరణంతో ఖాళీపడిన ఈస్థానానికి ఇప్పుడు జరిగిన ఈ ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. ఇక అనంతపురం జిల్లాలో యల్లనూరు మండలంలో జగ్గంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచి ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో టిడిపి మద్దతుదారుడు కుళ్లాయప్ప విజయం సాధించారు.
టిడిపిలో జోష్
స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైసిపితో పోటీపడి మెరుగైన స్థానాల్లో విజయం సాధించడంతో టిడిపి శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. ఇది ఒక శ్యాంపుల్ సర్వేలా ఉందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో టిడిపికి అంత సానుకూలత లేదన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో నెలకొంది. ఇప్పుడు గ్రామ పంచాయతీకి జరిగిన వార్డుల్లోనూ, సర్పంచి స్థానాల్లోనూ మెరుగైన ఓట్లు రావడం చూసి ఆనందపడిపోతున్నారు, అధికార వైసిపి తమ అధికార బలాన్ని ప్రయోగించినా తమ మద్దతుదారులకు గట్టిపోటినిచ్చారని చెబుతున్నారు. అధికార వైసిపి మాత్రం ఈ ఎన్నికలను తాము అంత సీరియస్‌గా తీసుకోలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా స్థానిక సంస్థల ఉప ఎన్నికల పోరు రసవత్తరంగానే సాగింది. ఈ ఎన్నికలను రాజకీయ విశ్లేషకులు సైతం నిశితంగానే పరిశీలిస్తున్నారు. రాబోయే సాధారణ ఎన్నికలకు ఇవి శ్యాంపుల్ సర్వేలనే భావించాల్సి ఉంటుందంటున్నారు.
ప్రశాంతంగా సాగిన ఎన్నికలు
ఉప ఎన్నికలు రెండు జిల్లాల్లోనూ ప్రశాంతంగా జరిగాయి. ఉదయం ఏడు గంటలకు అన్ని చోట్ల పోలింగ్ మొదలైంది. సాయంత్రం ఓట్ల లెక్కింపు కూడా పూర్తయి ఫలితాలను వెళ్లడించారు. ఎక్కడా చిన్నపాటి ఘర్షణ, వివాదం లేకుండా సాఫీగా సాగాయి.
అనంతపురం జిల్లా
అనంతపురం జిల్లా వ్యాప్తంగా 33 వార్డులు, రెండు సర్పంచి స్థానాలకు ఎన్నికల నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 22 వార్డులతో పాటు పెద్దపప్పూరు మండలం దేవునిఉప్పలపాడు సర్పంచి స్థానంకు ఒకే నామినేషన్ దాఖలు కావడంతో అక్కడ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఇక మిగిలిన 11 వార్డులతో పాటు యల్లనూరు మండలం జంగంపల్లి సర్పంచి స్థానానికి శనివారం నాడు ఎన్నికలు నిర్వహించారు. జిల్లా పరిధిలో 11 వార్డులకు జరిగిన ఉప ఎన్నికల్లో టిడిపి మద్దతుదారులు 5, వైసిపి మద్దతుదారులు 6 స్థానాల్లో గెలుపొందారు. ఇక యల్లనూరు మండలం జంగంపల్లి పంచాయతీ సర్పంచి ఎన్నికల్లో టిడిపి మద్దతుదారుడు విజయం సాధించారు.
శ్రీ సత్యసాయి జిల్లా
శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా మొత్తం 28 వార్డులు, ఒక సర్పంచి స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఒకే నామినేసన్ దాఖలు కావడంతో 15 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన హిందూపురం మండలం చలివెందుల సర్పంచి స్థానానికి, 13 పంచాయతీల్లో 13 వార్డులకు శనివారం నాడు ఎన్నికలు నిర్వహించారు. జిల్లా పరిధిలో 13 వార్డులకు ఉపఎన్నిక జరగ్గా ఇందులో 7 టిడిపి మద్దతుదారులు, 6 వైసిపి మద్దతుదారులు గెలుపొందారు. ఇక హిందూపురం మండలం చలివెందుల సర్పంచి స్థానానికి జరిగిన ఎన్నికలో వైసిపి మద్దతుదారుడు విజయం సాధించారు.










