Mar 10,2023 21:33

లబోదిబోమంటున్న పాలకోడేరు ప్రజలు
ఎల్‌ఆర్‌ఎస్‌ అనుమతి ఉన్నా బిఎల్‌ఆర్‌ ఇవ్వని వైనం
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు బాధితులు సిద్ధం
ప్రజాశక్తి - పాలకోడేరు
అది జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న మండల కేంద్రం. అక్కడ పంచాయతీ కార్యదర్శి రమాలీల రూటే సపరేటు. విధి నిర్వహణలో నిర్లక్ష్యపు ధోరణి, దురుసుగా ప్రవర్తనతో విసుగు చెందిన ఆ గ్రామ ప్రజలు జిల్లా అధికారులకు తమ గోడు చెప్పుకునేందుకు సిద్ధమయ్యారు. తమగోడు మండల స్థాయి అధికారులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.
పాలకోడేరు పంచాయతీ కార్యదర్శి సిహెచ్‌వి.రమాలీల తీరుపై పలువురు గ్రామస్తులు, బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా సమస్యపై కార్యాలయానికి వెళ్తే కనీస మర్యాద ఇవ్వకుండా హీనంగా చూస్తున్నారని ఆ గ్రామస్తులు ఎం.రాజేశ్వరి, సిహెచ్‌.శ్యామలరావు, నరేంద్ర వర్మ, పి.వెంకటేశ్వరరావు, సుబ్బరాజు, భాస్కర్‌రాజు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో సర్వే నెంబర్‌ 9/1, 9/2, 9/3, 10/1, 10/2, 1డి, 1ఇ, 2బిలో గల స్థలాన్ని ఏలూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ వారికి సుమారు రూ.27 లక్షలు చెల్లించి లేఅవుట్‌ అప్రూవల్‌ చేయించుకున్నారు. గతేడాది మే నెలలో ఈ అనుమతులు లభించాయి. ఈ స్థలంలో ఇళ్ల నిర్మాణానికి అనుమతుల కోసం పంచాయతీ కార్యదర్శి వద్దకు మూడు నెలలుగా తిరుగుతున్నారు. ప్లాన్స్‌ సబ్మిట్‌ చేసినా తమకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పట్లేదని వాపోయారు. పైగా తరచూ కార్యాలయానికి రావొద్దని హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎంపిడిఒ మురళీ గంగాధర్‌ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో బాధితులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమయ్యారు.
గ్రామంలో అక్రమ నిర్మాణాలు కోకొల్లలు
గ్రామంలో అక్రమ నిర్మాణాలు కోకొల్లలుగా సాగుతున్నాయి. వీటిపై కనీసం దృష్టి సారించని సంబంధిత పంచాయతీ కార్యదర్శి నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి చలానా కట్టి అనుమతులు కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ముప్పుతిప్పలు పెట్టడంపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంచాయతీ కార్యదర్శి తీరుతో గ్రామంలో అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి . చివరకు మండల స్థాయి అధికారులకూ అవస్థలు తప్పడం లేదు. గ్రామంలో తేజ వాటర్‌ ప్లాంట్‌ సమీపంలో ఉన్న జగనన్న కాలనీకి వెళ్లే మార్గం ఇబ్బందుల్లో చిక్కుకోవడానికి ఆమె శైలే కారణమని ప్రచారం సాగుతోంది. జగనన్న కాలనీకి సమీపంలోని ఓ ఉద్యోగి ఇంటి నిర్మాణం చేసుకోవడంతోపాటు కాలనీకి తన సొంత స్థలాన్ని దారి నిమిత్తం ఇచ్చారు. అయితే ఇంటి నిర్మాణంలో పంచాయతీ నుంచి ఇబ్బందులు ఎదురవ్వడంతో విసుగు చెందిన సదరు ఉద్యోగి తన ఇంటి నిర్మాణాన్ని పూర్తిగా నిలుపుదల చేసి జగనన్న కాలనీకి వెళ్లే మార్గాన్ని మూసివేశారు. దీంతో మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు అంతా తలలు పట్టుకుంటున్నారు. ఇక గ్రామ సర్పంచి ఇంజేటి మరియమ్మ దళిత మహిళ కావడంతో ఆమె మాటకు కనీస విలువ ఇవ్వని పరిస్థితి. అయితే వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్న పంచాయతీ కార్యదర్శికి రాజకీయ అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ప్రచారంతో మండలస్థాయి అధికారులు ఆమెపై చర్యలకు వెనుకాడుతున్నారని తెలిసింది.
ఎల్‌ఆర్‌ఎస్‌ ఉంటే అనుమతులు ఇవ్వొచ్చు
రెడ్డియ్య, ఇఒపిఆర్‌డి
నిబంధనల ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్‌ ఉంటే భవన నిర్మాణాలకు అనుమతి ఇవ్వొచ్చని పాలకోడేరు ఇఒపిఆర్‌డి రెడ్డియ్య తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్‌ అనుమతి ప్రకారం నామమాత్రపు రుసుము కట్టించుకుని పంచాయతీ నుంచి బిఎల్‌ఆర్‌ ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహించినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా సంబంధిత పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామన్నారు.