Jul 24,2023 21:45

మాట్లాడుతున్న సిఐటియు నాయకులు హనుమంతురెడ్డి

           ప్రజాశక్తి-తాడిపత్రి రూరల్‌   రోజూ ప రిసరాలను శుభ్రం చేసే పంచాయతీ కార్మికుల వేతనాలను పెంచాలని సిఐటియు నాయకులు హనుమంతురెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం రూరల్‌ పరిధిలోని గన్నెవారిపల్లి కాలనీలో నిర్వహించిన పంచాయతీ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొన్నేళ్లుగా పంచాయతీల్లో సేవలు అందిస్తున్న కార్మికులకు కేవలం రూ.8వేలు మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. పెరిగిన నిత్యావసర ధరలతో ఈ వేతనాలు ఏమూలకూ చాలడం లేదన్నారు. అదేవిధంగా తాడిపత్రిలో ఉన్న జనాభాలో సగం జనాభా గన్నెవారిపల్లి పంచాయతీలో ఉందన్నారు. జనాభాకు అనుగుణంగా పంచాయతీ కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్‌ చేశారు. అలాగే కార్మికులకు అందించే చేతి తొడుగులు, సబ్బులు, నూనె వంటివాటిని అందివ్వడం లేదన్నారు. ఆయా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 26న రాష్ట్రవ్యాప్తంగా ఎంపిడిఒ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ధర్నాలో పంచాయతీ కార్మికులతోపాటు ప్రజలు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి జగన్‌ మోహన్‌రెడ్డి, కెవిపిఎ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, పంచాయతీ కార్మికులు రామకృష్ణ, రాజు, ఓబయ్య, సంధ్య, వెంకటసుబ్బమ్మ, తదితరులు పాల్గొన్నారు.