Aug 17,2023 22:15

పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
జిల్లా కార్యదర్శి గోవిందప్ప
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

చిత్తూరు నగరం శేషాపిరాన్‌ వీధిలోని సిఐటియు కార్యాలయంలో పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు మధు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా కార్యదర్శి గోవిందప్ప మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతున్న పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, నామినీలకు ఉద్యోగాలు ఇవ్వాలని, 2015లో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న జీతాలను ఇవ్వాలని, ప్రతి పంచాయతీకి పిఎఫ్‌ ఈఎస్‌ఐ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కాంచివరం సురేంద్ర మాట్లాడుతూ అట్టడుగు వర్గాలైన పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అవుతున్నదని ఆయన విమర్శించారు. ఈనెల 23వ తారీఖున చిత్తూరు జిల్లాలోని అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఈరాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా పంచాయతీ కార్మికుల పనిచేస్తున్నప్పటికీ సక్రమమైన జీతాలు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. నేడు నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే, ఆదాయాలు పాతాళ పాతాళానికి పడిపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గంగరాజు మాట్లాడుతూ పంచాయతీ కార్మికులు ఒంటరిగా లేరని, వీరికి మద్దతుగా అనేక సంఘాలు నిలబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.చైతన్య, జ్యోతి, గిరిధర్‌ గుప్తా, జిల్లాలోని పంచాయతీ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.