ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : డిసెంబర్ 8, 9 తేదీల్లో పల్నాడు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో నిర్వహించే పల్నాడు బాలోత్సవం (పిల్లల పండుగ), చెకుముకి సైన్స్ సంబరాలకు సంబంధించి కరపత్రాలను జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్, ఎమ్మెల్సీ కె.ఎస్ లక్షణరావు, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు శుక్రవారం వేర్వేరుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలల్లో సృజనాత్మక ఆలోచనలు రేకెత్తించేలా బాలోత్సవాలు నిర్వహించాలని, ఈ కార్యక్రమం జయప్రదానికి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. పల్నాడు బాలోత్సవం కమిటీ ప్రధాన కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు మాట్లాడుతూ పల్నాడు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా చిత్రకళా పోటీలు నిర్వహించగా విశేష స్పందన లభించిందని తెలిపారు. 1200 మందికి పైగా బాలబాలికలు చిత్రకళా పోటీల్లో పాల్గొన్నారని, ఈ అనుభవంతో పల్నాడు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పల్నాడు బాలోత్సవం అనే విభాగం ఏర్పడి పనిచేస్తోందని వివరించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో నర్సరావుపేట పట్టణంలోని పిఎన్‌సి అండ్ కెఆర్ కళాశాల ఆవరణలో జిల్లా స్థాయిలో బాలోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పల్నాడు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుండి విద్యార్థులు హాజరు కావచ్చన్నారు. 30 రకాల సాంస్కృతిక, అకడమిక్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సబ్ జనియర్స్ 3, 4, 5 తరగతులు, జూనియర్స్ 6, 7 తరగతులు, సీనియర్స్ 8, 9, 10 తరగతులు విభాగాలకు కలిపి మొత్తం 66 అంశాల్లో పోటీలు ఉంటాయని, ప్రతి ఈవెంట్‌కు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఉంటాయని, పాల్గొన్న ప్రతి విద్యార్థికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇస్తామని వివరించారు. బాలోత్సవంలో పాల్గొనే బాలలకు, వారితోపాటు వచ్చే ఉపాధ్యాయులకు భోజన వసతులు ఏర్పాటు చేస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే ప్రతి పాఠశాలకు బాలోత్సవం కమిటీ సభ్యులు ఎంట్రీ ఫారాలను తీసుకువెళ్లి అందిస్తారని, జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఈ పోటీలకు తమ విద్యార్థులను పంపించడానికి సహకరించాలని కోరారు. ఎంట్రీ ఫారాలు పూర్తి చేసి నవంబర్ 30 తేదీలోగా తమకు అందించాలన్నారు. బ్రోచర్లో తెలిపిన క్యూఆర్ కోడ్ లేదా వెబ్‌సైట్ అడ్రస్ ద్వారా ఎంట్రీలను అప్లోడ్ చేయవచ్చన్నారు. మరిన్ని వివరాల కోసం పల్నాడు బాలోత్సవం కమిటీకి సభ్యుల 7207450369, 9440915861, 94913 69330, 7893483132, 9390070555 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో పల్నాడు బాలోత్సవం కమిటీ అధ్యక్షులు, ఆక్స్‌ఫర్డ్ ఎడ్యుకేషన్ సొసైటీ డైరెక్టర్ రాజారెడ్డి, సహాయ కార్యదర్శి ఎ.లక్ష్మీశ్వరరెడ్డి, కోశాధికారి కె.రామారావు, కమిటీ సభ్యులు సాంబశివరావు, జి.శ్రీనివాసరావు, వెంకట్రావు, విజయసారధి, డి.బుజ్జిబాబు, నాగేశ్వరరావు, పల్నాడు విజ్ఞాన కేంద్రం కార్యనిర్వాహక కన్వీనర్ మస్తాన్‌వలి పాల్గొన్నారు.










