పలమనేరులో పశుపరిశోధనా కేంద్రం
పుంగనూరు జాతి ఆవులను పునరుత్పత్తి చేయడమే లక్ష్యం : మంత్రి అప్పలరాజు
ప్రజాశక్తి- పలమనేరు
మిషన్ పుంగనూరు ద్వారా భారతదేశంలో ప్రసిద్ధ గాంచిన పుంగనూరు జాతి ఆవుల వద్దికి ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరుగుతున్నదని రాష్ట్ర పశుసంవర్థక, పాడి పరిశ్రమాభివద్ధి, మత్స్య శాఖా మాత్యులు డాక్టర్ సీదిరి అప్పల రాజు పేర్కొన్నారు. బుధవారం మంత్రి చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా పలమనేరులో కోటి84 లక్షలతో శ్రీవెంకటేశ్వర పశువైద్యవిశ్వ విద్యాలయం పశుపరిశోధనా కేంద్రం, ఐవిఎఫ్ అండ్ ఈటి ప్రయోగశాల నూతన భవన సముదాయంను జెడ్పి చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, రాష్ట్ర విదేశీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు జ్ఞానేంద్రరెడ్డి, పలమనేరు ఎంఎల్‌ఎ వెంకటేగౌడ్, ఎంఎల్‌సి భరత్‌లతో కలసి ప్రారంభోత్సవం చేశారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రికి జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ పుష్ప గుచ్ఛం అందజేశారు.
అనంతరం రైతులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ మిషన్ పుంగనూరు కార్యక్రమంను పశుసంవర్థకశాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందన్నారు. భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన పుంగనూరు జాతి ఆవులు అంతరించిపోకుండా వాటిని వృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. ఐవిఎఫ్ ద్వారా ఎంబ్రీయోట్రాన్స్ఫర్ టెక్నాలజీని వినియోగించి పుంగనూరు ఆవుల జాతిని పునరుద్ధరించడం ఈ మిషన్ ముఖ్య ఉద్యేశమని తెలిపారు. పుంగనూరు ఆవులు అంతరించి పోకుండా కాపాడి పుంగనూరు జాతి ఆవులను పెద్ద ఎత్తున ప్రాచుర్యం చేకూర్చేందుకు సంబంధిత అధికారులు, సిబ్బంది ప్రయత్నం చేయడం జరుగుతోందన్నారు. అలాగే తిరుపతిలోని ల్యాబ్‌లో ఇప్పటికే కొన్ని పశు జాతులకు సంబంధించి పరిశోధనలు మొదలు పెట్టడం జరిగిందని ఒంగోలు, సాహివాల్ జాతుల ఆవుల ఎంబ్రియో కలెక్సషన్ జరుగుతోందని తెలిపారు. దీంతో పాటు పుంగనూరు ఆవులకు సంబంధించి స్యాంపిల్ కలెక్షన్ కూడా త్వరలో పెద్దఎత్తున ప్రారంభమవుతుందని తెలిపారు. ఎస్వీయూ గోశాలకు అనుసంధానంగా ఈటీటీ ల్యాబ్‌లో సాహివాల్, పుంగనూరు ఆవులకు సంబంధించి ఎంబ్రీయో ట్రాన్స్ఫర్ చేసే టెక్నాలజీ ల్యాబ్ ఉందని దానికి అనుసంధానంగా పలమనేరులో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దీని ద్వారా అంతరించిపోతున్న పుంగనూరు ఆవులను కాపాడటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి మొక్కలు నాటారు. అలాగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందుగా మంత్రి పలమనేరు మండలంలోని కెటిల్ ఫామ్ వద్దగల శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ లైవ్‌స్టాక్ రీసెర్చ్‌స్టేషన్ (పుంగనూరు పొట్టి జాతి ఆవుల పెంపక కేంద్రం)ను ఎమ్మెల్యే వెంకటేగౌడతో కలిసి పరిశీలించారు. శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ విసి పద్మనాభరెడ్డి, డీన్ సజ్జన్‌రావు, రిజిస్టర్ రవి, డైరీసైన్స్ డీన్ సురేష్, కుప్పం ఆర్డీవో శివయ్య, శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ గోశాల సైంటిస్ట్ వేణుగోపాల్, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి వెంకట్రావు, పలమనేరు, గంగవరం తహసీల్దార్లు కుప్పుస్వామి, మురళి, పశు పరిశోధనా కేంద్రం పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.










