'పల్లెబాట'లో ప్రజల ఆదరణ మరువలేనిది
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ప్రజాశక్తి- సోమల: మండలంలో నాలుగు రోజులుగా జరుగుతున్న పల్లెబాట కార్యక్రమంలో ప్రజల ఆదరణ మరువలేనిదని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గత మూడు రోజులుగా చంద్రబాబు నాయుడు తనని విమర్శించే పనిలో ఉన్నాడని, రాజకీయాల్లో ఎంత మంచి చేసినా, చెడుగా చిత్రీకరించి విమర్శించే వారు చాలా మంది ఉంటారని ఆరోపించారు. శనివారం సోమల మండలంలో నాలుగవ రోజు పల్లెబాట కార్యక్రమం నిర్వహించారు. మొత్తం నాలుగో రోజల పాటు సోమల మండలంలో 164 పల్లెలు పర్యటించి ప్రజాసమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలుసమస్యలను క్షేత్రస్థాయిలో అప్పటికప్పుడే పరిష్కరించారు. కందూరు, వల్లిగట్ల, కామిరెడ్డిగారిపల్లి పంచాయతీల పరిధిలోని 38పల్లెల్లో పర్యటించారు. పల్లెబాట సందర్భంగా ప్రజలను ఉద్దేశించి కందూరులో ప్రసంగించారు. ఈసందర్భంగా చంద్రబాబు విమర్శలపై తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు కావాలని తనను టార్గెట్ చేస్తున్నారని, సంబంధం లేకపోయినా తన పేరును కావాలని తీసుకొచ్చిమరి తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. గత మూడు రోజులుగా చంద్రబాబు నాయుడు అదే పనిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. పుంగనూరు ప్రాంతంలో అంతా శాంతియుతంగా ఉంటే, ఇక్కడే ఏదో జరుగుతుందని అసత్యాలు ప్రచారం చేస్తూ తనపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా నియోజకవర్గంలో, రాష్ట్రంలో పేదరికం చూసి అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, ముఖ్యమంత్రి జగన్ అండగా ఉండి, నియోజకవర్గ అభివద్ధికి కషి చేస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా సిఎం వైఎస్ జగన్‌కు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ప్రతి గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంకులు ఏర్పాటు చేస్తున్నామని, త్వరలోనే ఇంటింటికీ కుళాయి ద్వారా నీరు అందిస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఆవులపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం ప్రస్తుతం కొనసాగుతుందని, ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఇకపై సోమల, పరిసర ప్రాంతాలకు తాగు, సాగు నీరుకు ఎటువంటి ఇబ్బందీ ఉండదని తెలిపారు. ఈ స్థాయిలో నియోజకవర్గం అభివద్ధి చేసుకునే అవకాశం వస్తుందని, తాను కూడా ఎప్పుడూ ఊహించలేదని వివరించారు. పల్లెబాటలో బాగంగా శనివారం బాలప్పగారిపల్లిలో బిసి కమ్యూనిటీ హాల్, పాతూరులో సచివాలయం, కందూరులో ఆర్‌ఓ ప్లాంట్, సచివాలయ భవనాలు ప్రారంభించారు. సర్పంచులు బాషా మసూద్, సౌజన్య, ఎంపీటీసీ కళ్యాణి, ఎంపీపీ ఈశ్వరయ్య, వైసిపి నాయకులు బాలకష్ణ, బాలసుబ్రమణ్యం, మెకానిక్ బాష, అధికారులు, సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.
యుటిఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి పెద్దిరెడ్డి
యుటిఎఫ్ క్యాలెండర్, డైరీని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం కందూరులో ఆవిష్కరించారు. మండల యూటీఎఫ్ అధ్యక్షులు వెంకటరమణ, జనరల్ సెక్రెటరీ హరినాథ్, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి లక్ష్మీపతి క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు. అనంతరం కందూరు జడ్పీ హైస్కూల్‌లో ఉన్నత పాఠశాల సిబ్బంది యుటిఎఫ్ మండల కార్యవర్గం క్యాలెండర్, డైరీని ఆవిష్కరించారు.










