Jul 10,2022 23:10

ప్లీనంలో ప్రజాసమస్యల ప్రస్తావన ఏది..?
వ్యకాసం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి:

ఇటీవల వైసిపి నిర్వహించిన ప్లీనంలో ప్రజాసమస్యల పరిష్కారం పైన ప్రస్తావనే లేకుండా పోయిందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు అన్నారు. నగిరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వేలాది మంది పవర్లూమ్‌ కార్మికులు కూలిరేట్లు పెంచాలని ఆరు రోజులుగా సమ్మె చేస్తున్న విషయం విధితమే. దీనికి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపినేత కార్మికుల గురించి పట్టించుకోవడం లేదని చెప్పారు. దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలవల్ల పేదవారు బతికే పరిస్థితి లేకుండా పోతుందని వాపోయారు. స్థానికంగా ఉన్న మంత్రి, ఎమ్మెల్యే ఆర్‌కె.రోజా కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ఏమాత్రం చొరవ చూపడం లేదని విమర్శించారు. పవర్లూమ్‌ కార్మికులకు 300 యూనిట్లు నిబంధన పెట్టడం అన్యాయమని దీన్ని 500కు పెంచాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు అనేక రాయితీలు వస్తున్నాయి కానీ ఇలాంటి పవర్లు కార్మికులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించడం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో ఇస్తున్న విధంగా కూలి రేట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వెంటనే కూలి రేట్లు పెంచాలని, పోరాటం విజయవంతం అయ్యేంతవరకు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ నుంచి సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. సిఐటియు చిత్తూరు జిల్లా అధ్యక్షులు వాడ గంగరాజు మాట్లాడుతూ పవర్లూమ్‌ కార్మికుల పరిస్థితి దారుణంగా ఉందని మంత్రి ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లి యాజమాన్యాలతో మాట్లాడి కూలి పెంచాలని, విద్యుత్తు చార్జీలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం నేడు కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పుత్తూరు సిఐటియు నాయకులు వెంకటేష్‌, పెరుమాళ్‌లతో పాటు భారీస్థాయిలో పవర్లూమ్‌ కార్మికులు పాల్గొన్నారు.