ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ నగరంలోని దుకాణదారులు ప్లాస్టిక్ వస్తువులు, కవర్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఇన్‌ఛార్జి కమిషనర్ రమణారెడ్డి హెచ్చరించారు. ఇందులో భాగంగా నగరంలోని పలు దుకాణాల్లో సిబ్బందితో కలిసి శుక్రవారం దాడులు నిర్వహించారు. నగరంలోని రాజు రోడ్డులో ఉన్న మహావీర్, మహాలక్ష్మి ప్లాస్టిక్ దుకాణాల్లో విక్రయిస్తున్న ప్లాస్టిక్ వస్తువులను సీజ్ చేసి ఒక్కో దుకాణానికి రూ.10వేల చొప్పున జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ విక్రయిస్తే మొదటి విడత రూ.10వేల జరిమానా, రెండోసారి లైసెన్స్‌ను రద్దు చేస్తూ ఎక్కడా వ్యాపారం చేయకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం వివిధ అభివృద్ధి పనులపై ఇంజినీరింగ్ సిబ్బంది, అకౌంట్ సెక్షన్ విభాగాలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో చేపడుతున్న నిర్మాణ పనులను త్వరితగతిన, నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో ఎలాంటి జాప్యం ఉండరాదని ఇంజినీర్లను ఆదేశించారు. అంతకుమునుపు ఉదయం నగరపాలక ఆరోగ్యాధికారి గంగాధర్‌రెడ్డి, డిఇ రామ్‌ప్రసాద్‌తో సమావేశం నిర్వహిస్తూ క్లాప్ ఆటోల కేటాయింపు, ఇతర పారిశుధ్య పనులపై పలు సూచనలు చేస్తూ నగర పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే సాయంత్రం టౌన్ ప్లానింగ్ సిబ్బంది, ప్లానింగ్ కార్యదర్శులతో నగరపాలక సమావేశ మందిరంలో సమావేశమై పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించిన అంశాలపైన వివరాలను తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎస్‌ఇ సతీష్‌చంద్ర, ఇఇలు రామ్మోహన్‌రెడ్డి, నగరపాలక కార్యదర్శి సంఘం శ్రీనివాసులు, ఎంహెచ్‌ఒ గంగాధర్‌రెడ్డి, సిఒలు శానిటేషన్ సెక్రటరీలు, డిఇలు, ఎఇలు, తదితరులు పాల్గొన్నారు.
దుకాణంలో తనిఖీ చేస్తున్న ఇన్‌ఛార్జి కమిషనర్ రమణారెడ్డి










