Oct 08,2023 23:54

యథేచ్ఛగా తవ్వుతున్న కంకర

* కళ్లెదుటే మాయం
* ఇష్టానుసారంగా తవ్వకాలు
* పట్టించుకోని రెవెన్యూ, మైన్స్‌ అధికారులు
         ఒకప్పుడు జగనన్న కాలనీ ప్రాంతంలో కొండలు కనిపించేవి. నేడు ఆ కొండలు కనుమరుగవుతున్నాయి. నెలలు గడుస్తున్నా సమయంలో కొండలు తవ్వి కంకర తరలిపోతున్న తరుణంలో కొండలు మాయమవుతున్నాయి. ఇష్టానుసారంగా రాత్రి, పగలు తేడాలేకుండా కంకర తవ్వకాలు చేపడుతుండడంతో టన్నులకొద్దీ కంకర విక్రయించి కంకర మాఫియా ప్రతినిధులు కోట్లు సంపాదించికుంటున్నారు. ఇవన్నీ రెవెన్యూ, మైన్స్‌ అధికారుల కనుసన్నలలో జరుగుతున్నాయన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.
ప్రజాశక్తి- పలాస : 
కాశీబుగ్గ పట్టణానికి సమీపంలో ఉన్న కోసంగిపురం కూడలి వద్ద పేద ప్రజల ఇళ్ల నిర్మాణాలకు జగనన్న కాలనీలో భాగంగా స్థలాలు పంపిణీ చేశారు. ఆ ప్రాంతంలో కొండలు కనిపించేవి. రామకృష్ణాపురం రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 148లో ఉన్న భూములు కాలనీకి, మెండు అటవీ భూములకు మధ్య వారధిగా ఉండేది. కాలనీ నిర్మాణంలో కొంత కొండ కరిగిపోగా మిగిలిన భాగంలో హిందు, ముస్లిమ్‌, క్రిష్టియన్లకు 50 సెంట్లు చొప్పున శ్మశానం కోసం కేటాయిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. మిగిలిన కొండ యథాతథంగా ఇప్పటి వరకూ ఉండేది. ఈ క్రమంలో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు నిర్మాణం జోరందుకోవడం తో అక్కడున్న కంకర కొండపై అక్రమార్కుల కన్ను పడింది. వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కొండను రెండు ప్రొక్లెయిర్ల సహాయంతో కంకర తవ్వి పిండి చేస్తూ కంకరను తరలించుకుపోతున్నారు. వాస్తవానికి మైన్స్‌ విభాగం దీన్ని పరిశీలించి నిబంధనల మేరకు అనుమతులు ఇవ్వాల్సి ఉంది.
ఇదిలా ఉండగా రాళ్లు, కంకర, ఇసుక తరలించేందకు ప్రయివేటు వ్యక్తుల వద్ద విశ్వ సముద్ర గ్రూప్‌ సెస్‌ వసూళ్లు చేయడానికి అనుమతులు ఉన్నాయి. అయితే తవ్వకాలకు మాత్రం రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఎన్‌సి ప్రకారం మైన్స్‌ అధికారులు అనుమతులు ఇవ్వాల్సి ఉంది. పై మూడు పనులు జరగకుండానే కొండను తవ్వి కంకరను తరలిస్తుండడం సర్వత్రా వివమర్శలకు దారితీస్తోంది. తాము రాజకీయ నాయకుల అనుమతులు తీసుకున్నామని, తాము రాజకీయ నాయకుల అనుమతులు తీసుకున్నామని, మరెవరి అనుమతులు అవసరం లేదన్న చందంగా నిర్వాహకులు వ్యవహరిస్తుండడం విశేషం. ఇప్పటికే నియోజకవర్గంలో కొండలను తవ్వి కంకరను తరలించ కుపోతున్నారని విమర్శలు ఉన్న నేపథ్యంలో మళ్లీ అక్రమంగా కొండలను తవ్వడం చర్చనీయాంశంగా మారింది.
ఈ విషయంపై తహశీల్దార్‌ ఎల్‌.మధుసూదనరావును వివరణ కోరగా తమ దృష్టికి ఈ విషయం రాలేదని, గతంలో తవ్వగా తాము అడ్డుకొని ట్రాక్టర్‌ యజమానులపై కేసులు నమోదు చేశామని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న విషయంలో ఫీల్డ్‌ సర్వే చేసి సంబంధిత ట్రాక్టర్‌, ప్రొక్లెయినర్‌ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు.
ట్రాక్టర్లతో తరలింపు
రెవెన్యూ, మైన్స్‌ అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా కంకర తవ్వి ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. ఇటీవల కాలంలో అక్రమ లే అవుట్లు ఇష్టానుసారంగా పుట్టగొడుగులా వేయడంతో రాత్రి, పగలు తేడాలేకుండా ట్రాక్టర్‌ లోడ్‌ సుమారు రూ.వెయ్యి నుంచి రూ.1200 వరకు అమ్ముకుంటున్నారని, డిమాండ్‌ బట్టి ధర ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోతున్నారని తెలుస్తోంది. ట్రాక్టర్‌ లోడ్‌తో కంకర తరలించే సమయంలో కంకర తవ్వకాలు చేపట్టిన వ్యక్తులు బిల్లు తప్పని సరిగా ఇవ్వాలి. రోడ్డు పైకి ట్రాక్టర్‌ లోడ్‌ వచ్చే సరికి విశ్వ సముద్ర సంస్థ ప్రతినిధులకు రూ.300లు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, అక్రమ కంకర తవ్వకాలు చేపడుతుండడంతో ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం రాకుండా పోతుంది. ప్రభుత్వానికి చేరాల్సిన ఆదాయం కాశీబుగ్గ కంకర మాఫియా ప్రతినిధుల జోబులోకి చేరుతున్నట్లు తెలుస్తోంది. రామకృష్ణాపురం జగనన్న కాలనీ సమీపంలో ఉన్న కంకర కొండ కంకర మాఫియా ప్రతినిధులకు ధన కొండగా మారింది. ఎంత తవ్వుకుంటే అంతలా అక్షయ పాత్రలా మారింది.