
పలాస : పలాస రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని ఎపి రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.మోహనరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌పై పలాస ఆర్‌డిఒ కార్యాలయం వద్ద రైతుసంఘం ఆధ్వర్యాన శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులతో సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురం, కవిటి ప్రాంతాల్లో ఉబాలు వేయలేదన్నారు. వరి పంట పొట్ట దశలో ఉందని, ఈ సమయంలో వంశధార నీరు శివారు భూములకు అందడం లేదన్నారు. దీంతో కొందరు రైతులు చెరువులు, కుంటలు, వాగులో మోటారు ఇంజినర్లతో సాగునీరు పెట్టుకుంటున్న దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం, కనీసం సాగునీరు అందించలేని పరిస్థితుల్లో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక వంశధార శివారు భూములకు సాగునీరు అందించకపోగా, రైతుల నుంచి దౌర్జన్యంగా నీటితీరువా వసూలు చేస్తోందని విమర్శించారు. రబీకి విత్తనాలు ఉచితంగా పంపిణీ చేయాలని, పంటరుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఉపాధి హామీలో 200 రోజులు పని కల్పించాలని, రోజుకు రూ.600 కూలి చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం ఆర్‌డిఒ కార్యాలయ ఎఒ పి.బాలకు వినతిపత్రం అందజేశారు. ధర్నాకు సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్.గణపతి, గిరిజన సంఘం నాయకులు ఎస్.ఫల్గుణరావు సంఘీభావం తెలిపారు. రైతుసంఘం నాయకులు కె.బాలాజీరావు, కె.హేమసూదన్, టి.భాస్కరరావు, పి.సాంబమూర్తి, జి.గోవింద్, వ్య.కా.స నాయకులు డి.భాస్కరరావు, డి.భానమ్మ తదితరులు పాల్గొన్నారు