
* ఉక్కు రక్షణ కోసం సిపిఎం బైక్ యాత్ర
* నేడు ఎచ్చెర్లకు రానున్న ర్యాలీ
* జిల్లాలో మూడు రోజుల పాటు సాగనున్న జాతా
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకునేందుకు సిపిఎం పోరాటాన్ని ఉధృతం చేసింది. ప్లాంట్ ప్రయివేటీకరణకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పనుతున్న కుట్రను ప్రజలకు వివరించి చైతన్యపరిచేందుకు సమాయత్తమైంది. ఉత్తరాంధ్ర జిల్లాలో బైక్ జాతా మొదలుపెట్టింది. అందులో భాగంగా విశాఖలో ఈనెల 20న ప్రారంభమైన జాతా గురువారం సాయంత్రం 4.30 గంటలకు ఎచ్చెర్ల చేరుకోనుంది. వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడ నుంచి ఆమదాలవలస బయలుదేరి వెళ్లనున్నారు. జాతాలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటైన నేపథ్యం, ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధిలో ప్లాంట్ అవసరం, ప్రయివేటీకరణకు కేంద్రం అనుసరిస్తున్న దుర్మార్గ విధానాలు, రాష్ట్రంలో పాలక, ప్రతిపక్షాల తీరును ప్రజలకు, యువతకు వివరించనున్నారు. జిల్లాలో మూడు రోజుల పాటు జాతా కొనసాగనుంది.
విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో ఏర్పాడిన విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో జిల్లాకు చెందిన వేలాది మంది పర్మినెంట్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ప్రభుత్వానికి ఏటా రూ.వేల కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తోంది. సిఎస్‌ఆర్ నిధుల ద్వారా ఎన్నో గ్రామాలు, పట్టణాల్లో పలు ప్రాంతాల అభివృద్ధికి పరోక్షంగా దోహదపడుతోంది. లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది. వీరి అవసరాలు తీర్చే ట్రాన్స్‌పోర్టు, కూరగాయాలు, టీ, టిఫిన్ వంటి దుకాణాలతో పాటు ఎన్నో వ్యాపారాలు చేస్తూ గాజువాక, కూర్మన్నపాలెం ప్రాంతాల్లో బతుకీడుస్తున్న వారు వేలాది మంది ఉన్నారు. ఇటువంటి బంగారు బాతు గుడ్డు వంటి స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వం నష్టాల పేరుతో ప్రైవేటు సంస్థకు అమ్మేస్తుందన్న వార్త విస్మయానికి గురిచేస్తోంది. ప్లాంట్ ప్రైవేటుపరమైతే ఉద్యోగాలు తగ్గిపోతాయి. ఉద్యోగులకు, కాంట్రాక్టు కార్మికుల ఉపాధి భద్రత ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో సిపిఎం ఆధ్వర్యాన స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు ఏడాది కిందట నుంచి నిరవధికంగా ఆందోళనలు చేస్తున్న విషయం విదితమే. ఇది రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మారింది. ఈ నేపథ్యంలో దిశ మార్చుకున్న కేంద్ర ప్రభుత్వం ప్లాంట్‌ను ముక్కలుగా విభజించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి గానీ, ప్రతిపక్ష టిడిపి గానీ, కేంద్రం వద్ద తనకు ఎంతో పలుకుబడి ఉన్నట్టుగా చెప్పుకుంటున్న జనసేన గానీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. ఈ మూడు పార్టీలూ లాలూచీ పడడంతో కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. ఇటువంటి తరుణంలో మన జిల్లాలోని ప్రతి పల్లె తల్లడిల్లుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ఆధారపడి సుమారు రెండు లక్షల మందికి పైగా జీవనం సాగిస్తుండగా, అందులో మన జిల్లాకు చెందిన వారు తక్కువలో తక్కువగా 20వేల మంది ఉంటారని అంచనా. కాంట్రాక్టు కార్మికులే సుమారు ఐదు వేల మంది ఉంటారు. పర్మినెంట్ ఉద్యోగులు మరో రెండు వేల మంది వరకు ఉండవచ్చు. మొత్తం స్టీల్‌ప్లాంట్ ఆధారంగా గాజువాక ప్రాంతంలో జీవిస్తున్న లక్షలాది మందికి పాలు, కూరగాయాలు, టీ, టిఫిన్, హోటల్స్, ఆటోలు, కార్లు నడుపుతూ వేలాది కుటుంబాలు ఉన్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్ అంశం ఉత్తరాంధ్ర జిల్లాలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాతో పాటు విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, పాడేరు జిల్లాల్లోనూ జాతా సాగనుంది.
బైక్ యాత్ర సాగేదిలా...
బైక్ యాత్ర గురువారం మధ్యాహ్నం 4.30 గంటలకు ఎచ్చెర్లకు చేరుకోనుంది. అక్కడ నుంచి బయలుదేరి సాయంత్రం ఆరు గంటలకు ఆమదాలవలస రానుంది. రాత్రి ఎనిమిది గంటలకు శ్రీకాకుళం చేరుకుని బస చేస్తారు. 22న ఉదయం పది గంటలకు శ్రీకాకుళం నగరంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద నిర్వహించనున్న బహిరంగ సభలో నాయకులు ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు నరసన్నపేట, 1.30 గంటలకు టెక్కలి, సాయంత్రం 5.30 గంటలకు పలాస చేరుకోనుంది. రాత్రి సోంపేటలో బస చేయనున్నారు. 23వ తేదీ ఉదయం పది గంటలకు ఇచ్ఛాపురం, 1.30 గంటలకు పాతపట్నం, సాయంత్రం 4.30 గంటలకు కొత్తూరు చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 5.30 గంటలకు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండకు చేరుకోనున్నారు.