Jul 27,2023 08:51

రాజకీయ పార్టీల నాయకులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ గౌతమి

         అనంతపురం కలెక్టరేట్‌ : స్పెషల్‌ సమ్మర్‌ రివిజన్‌ - 2024కు సంబంధించి చేపడుతున్న ఇంటింటి సర్వే పక్కాగా చేపట్టాలని కలెక్టర్‌ ఎం.గౌతమి ఆదేశించారు. బుధవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్లోని కలెక్టర్‌ ఛాంబర్‌లో స్పెషల్‌ సమ్మర్‌ రివిజన్‌ - 2024 ఇంటింటి సర్వేపై రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 19,39,163 మంది ఎలక్టోరోల్స్‌ ఉండగా, 5,98,798 హౌస్‌ హోల్డ్స్‌ ఉన్నాయన్నారు. ఎస్‌ఎస్‌ఆర్‌ 2024కు సంబంధించి ఈనెల 21వ తేదీ నుంచి ఇంటింటి సర్వే జరుగుతోందని చెప్పారు. షెడ్యూల్‌ ప్రకారం బిఎల్‌ఓ(బూతు లెవెల్‌ ఆఫీసర్‌)లు ఇంటింటి సర్వే పక్కాగా చేపట్టాలన్నారు. బిఎల్‌ఓలతో పాటు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన బూత్‌ లెవెల్‌ ఏజెంట్లు సర్వేలో పాల్గొనాలన్నారు. ఏమైనా ఫిర్యాదులు ఉంటే 1950 టోల్‌ ఫ్రీ నెంబర్‌కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి టోల్‌ ఫ్రీ నెంబర్‌ పనిచేస్తుందన్నారు. ఓటు హక్కు నమోదుపై విస్తతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రాజకీయ పార్టీల నాయకులు అందించిన సూచనలపై పరిశీలన చేయాలని సూచించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడుతూ జీరో పేరు మీద ఉన్న ఓటర్‌ లిస్ట్‌ను పరిశీలన చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల విభాగం డిప్యూటీ తహశీల్దార్‌ కనకరాజు, వైసిపి నాయకులు శ్రీనివాసులు, సిపిఎం నాయకులు నల్లప్ప, బాల రంగయ్య, బిజెపి నాయకులు ఈశ్వర ప్రసాద్‌, శ్యాంసుందర్‌, బీఎస్పీ నాయకులు హరిప్రసాద్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ శాన్వి, ఐటీ టెక్నీషియన్‌ శివ పాల్గొన్నారు.