ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఉప ఎన్నికలు పటిష్టంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఎం.గౌతమి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో గ్రామ పంచాయతీ ఉప ఎన్నికలపై సంబంధిత శాఖల అధికారులతో ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఖాళీగా ఉన్న సర్పంచులు, వార్డు మెంబర్ల ఉప ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే అన్నారు. దీంతో జిల్లాలో 2 సర్పంచు, 33 వార్డు సభ్యులకు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. వీటిలో పెద్దపప్పూరు మండలంలోని దేవునుప్పలపాడు గ్రామ పంచాయతీ సర్పంచి స్థానం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. మిగిలిన యల్లనూరు మండలంలోని జంగాలపల్లి సర్పంచి స్థానం కోసం ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే 33 వార్డు సభ్యులకు 21 వార్డు స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికగాక, మరొక చోట (యాడికి మండలం, వెంగన్నపల్లి గ్రామపంచాయతీలో ఐదవ వార్డు) ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదన్నారు. మిగిలిన 11 వార్డు సభ్యుల ఎన్నిక కోసం ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఈనెల 19న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పోలింగ్, అనంతరం అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేయాలన్నారు. ఎన్నికల కోసం 14 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి 14 మంది ప్రిసైడింగ్ అధికారులు, 29 మంది అదనపు పోలింగ్ అధికారులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈనెల 17న ఆయా మండలాల్లో ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులకు శిక్షణ ఇవ్వాలన్నారు. ఎన్నికల కోసం అవసరమైన మెన్, మెటీరియల్, బ్యాలెట్ బాక్స్ లను సిద్ధం చేయాలన్నారు. గుర్తించిన సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా సీరియస్‌గా ఎన్నికలను నిర్వహించాలని, కౌంటింగ్ కేంద్రం వద్ద అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన లైటింగ్ ఏర్పాటు చేయాలని, వీడియోగ్రఫీ కచ్చితంగా చేపట్టాలన్నారు. ఎన్నికల్లో ఎలాంటి చిన్న పొరపాటు జరగకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉండాలన్నారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల కోసం అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచుతామన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు వివరించారు. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో మధుసూదన్, డిపిఒ ప్రభాకర్ రావు, ఎస్‌బి ఇన్స్‌పెక్టర్ జాకీర్‌హుస్సేన్, యాడికి తహశీల్దార్ అలెగ్జాండర్, ఎంపిడిఒ లక్ష్మీనారాయణ, గుత్తి తహశీల్దార్ మహబూబ్‌బాషా, ఎంపిడిఒ శివాజీరెడ్డి, డివిజినల్ పంచాయతీ అధికారి సుమన జయంతి, తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ గౌతమి










