Jun 27,2023 21:31

మహిళలతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎం.గౌతమి

         ప్రజాశక్తి-ఆత్మకూరు    రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని పక్కడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్‌ ఎం.గౌతమి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని సనప గ్రామంలో నిర్వహించిన జగనన్న సురక్షను ఆకస్మింగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో జగనన్న సురక్ష అమలుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎవరైనా అర్హులై ఉండి పథకాలు అందకుంటే అలాంటి వారిని గుర్తించాలన్నారు. ఖచ్చితంగా ప్రతి ఇంటినీ సర్వే చేయాలన్నారు. ఒకవేళ ఇంటికి తాళం వేసి ఉంటే రెండోసారి ఆ ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాలన్నారు. పథకాలు లేదా డాక్యుమెంట్‌ సంబంధిత సమస్యలు ఉన్న వ్యక్తులందరినీ క్యాంపుకు రావడానికి ప్రోత్సహించాలన్నారు. ఈ సందర్భంగా పలువురు తమకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని, ఏడాదికాలంగా తన ఇంటి నిర్మాణానికి సంబంధించి ఉపాధి హామీ, హౌసింగ్‌ బిల్లులు అందలేదని కలెక్టర్‌ దష్టికి తీసుకురాగా స్పందించిన కలెక్టర్‌ డ్వామా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, హౌసింగ్‌ అధికారులతో ఫోన్‌ ద్వారా మాట్లాడి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఒ మధుసూదన్‌, మండల ప్రత్యేక అధికారి రఘునాథ్‌రెడ్డి తహశీల్దార్‌ షర్మిల, ఎంపిడిఒ విజయప్రసాద్‌, పంచాయతీ సెక్రటరీ కీర్తన, సర్పంచి నరసింహా, తదితరులు పాల్గొన్నారు.