Oct 25,2023 21:23

రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ గౌతమి

        అనంతపురం కలెక్టరేట్‌ : ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఈనెల 16వ తేదీ నుంచి నవంబర్‌ 10వ తేదీ వరకు మొదటి దశ ఈవిఎంల పరిశీలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ ఎం.గౌతమి తెలిపారు. బుధవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్లో ఈవీఎంలు, వివి ప్యాట్స్‌ల మొదటి దశ పరిశీలనపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాకి 7,057 బ్యాలెట్‌ యూనిట్స్‌, 5,462 కంట్రోల్‌ యూనిట్స్‌, 6,752 వివి ప్యాట్స్‌ ఈవిఎంలు వచ్చాయన్నారు. ఈవిఎంలు, వివి ప్యాట్స్‌ల పరిశీలన కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 2,628 బ్యాలెట్‌ యూనిట్స్‌, 2,260 కంట్రోల్‌ యూనిట్స్‌, 2,330 వివి ప్యాట్స్‌ ఈవిఎంల ఫస్ట్‌ లెవెల్‌ చెకింగ్‌ పూర్తి చేశామన్నారు. ఈనెల 27వ తేదీన ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా కార్యక్రమం-2024 కింద డాఫ్ట్‌ పబ్లికేషన్‌కు వెళ్తున్నామన్నారు. ఫామ్‌-7 డిలీషన్స్‌కు సంబంధించి డిలీషన్‌ కాకపోతే ప్రొసీజర్స్‌ ప్రకారం మళ్లీ తొలగించనున్నట్లు చెప్పారు. అనంతరం అనంతపురం నగరంలోని పాత ఆర్డీవో కార్యాలయం ఆవరణలో ఉన్న ఈవిఎం గోడౌన్లో బుధవారం నాడు ఈవిఎంలు, వివి ప్యాట్స్‌ల మొదటి దశ పరిశీలన కార్యక్రమాన్ని కలెక్టర్‌ గౌతమి పరిశీలించారు. మొదటి దశ కార్యక్రమాన్ని తొందరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్‌ఒ గాయత్రీ దేవి, ఎన్నికల విభాగం డిప్యూటీ తహశీలాదర్‌ కనకరాజు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.