ప్రజాశక్తి-అనంతపురం స్థానిక రుద్రంపేటలోని పివికెకె ఇంజినీరింగ్ కళాశాలలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం' కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల కరెస్పాండెంట్ డా.పల్లెరఘునాథ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ పల్లె కిషోర్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, కళాశాలకు మధ్య సన్నిహిత సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో నేడు పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాల ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల పూర్వ విద్యార్థుల ద్వారా ప్రస్తుత విద్యార్థులు కళాశాల విద్యాభ్యాసం తరువాత నిజజీవితంలో ఎదురయ్యే సవాళ్లు, వాటి కోసం తాము తీసుకున్న నిర్ణయాలు, వాటి తీపి-చేదు అనుభవాలు, వారి సలహాలు, సూచనలు, సంబంధిత రంగాలపై, దాని లోతుపాతులపై పూర్తిస్థాయి అవగాహన పొందేందుకు, సామూహిక సంబంధాలను మెరుగుపర్చుకోవటానికి దోహదపడుతుందన్నారు. ఒకే విధమైన ఆసక్తులు కలిగిన విద్యార్థులంతా కలిసి తమ జీవితంలో పూర్తి ఉత్సాహంతో విజయమార్గంలో పయనించడానికి వీలు కల్పిస్తుందని తెలిపారు. తరువాత సెమినార్లు, వర్క్‌షాప్‌లు, సామాజిక కార్యక్రమాలతో సహా అనేక రకాల కార్యకలాపాలు నిర్వహించారు. చాలా రోజుల తర్వాత కలుసుకున్న అనంతరం ఆనాటి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒకే వేదికపైకి చేరుకుని జ్ఞాపకాలను, మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. కొందరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా, మరికొందరు వ్యాపార రంగంలో, ఉపాధ్యాయులుగా, పోలీసు వృత్తిలో, మరికొందరు వ్యవసాయధారులుగా స్థిరపడ్డారు. వాళ్లంతా ఒకచోట చేరి ఆలింగనం చేసుకుంటూ సంతోషంతో ఉప్పొంగిపోయారు. ఒకరినొకరు పరిచయాలు చేసుకుంటూ, ఆటలు, పాటలు, సామూహిక భోజనాలు చేసి ఒకరి కష్ట సుఖాలు మరొకరు పంచుకున్నారు. తాము ఎప్పటికీ కలిసి ఉండాలని, తమ స్నేహం నేటి యువతకు ఆదర్శంగా ఉండాలని, కష్టకాలంలో అందరం తోటివారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ఆనాటి ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. బాధ్యతాయుతమైన పౌరులుగా, తల్లిదండ్రులుగా తమ పిల్లలకు నైతిక విలువలు, బాధ్యతాయుత ప్రవర్తన అలవడేలా పెంచాలని సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాల మధ్య సత్సంబంధాలు పెరిగేందుకు పూర్వవిద్యార్థుల సమ్మేళనం వంటి కార్యక్రమంలో ఎంతో దోహదపడతాయని వివరించారు. పూర్వవిద్యార్థులు నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి పల్లె సింధూర, యాజమాన్య ప్రతినిధి శ్రీకాంత్‌రెడ్డి, ప్రిన్సిపల్ డా.బండి రమేష్‌బాబు, ఏవో మనోహర్‌రెడ్డి, అలమ్ని ఇన్‌ఛార్జి సురేష్ తదితరులు పాల్గొన్నారు.










