పిల్లలన్ని బడికి పంపకుంటే సంక్షేమ పథకాలు రద్దు
విద్యాశాఖ సమీక్షలో జిల్లా కలెక్టర్ వెల్లడి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: బడిఈడు పిల్లలన్ని బడులకు పంపకుంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలను రద్దు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్ హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ సమావేశం హాల్‌లో ఎస్‌ఎస్‌ఏ పిఓ.వెంకట రమణారెడ్డి, డీఈ మధుసూదన్, గ్రామీణ నీటి సరఫరా ఎస్‌ఈ శంఖర్‌బాబుతో కలసి జిఈఆర్‌పై మున్సిపల్ కమిషనర్ల, డిప్యూటీ డీఈఓలు, ఎంపిడిఓలు, ఎంఈఓలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 24 కల్లా జిఈఆర్ (స్థూల నమోదు నిష్పత్తి) వందశాతం పూర్తి చేయాలని ఎంపిడిఓలు, ఎంఈవోలను ఆదేశించారు. గ్రామాలలో వలంటర్ల ఇంటింటికీ వెళ్లి సర్వే పూర్తి చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సర్వే చేసిన తర్వాత ఎంత మంది పిల్లలు పాఠాశాలలకు వెళ్లలేదనే సమాచారం తెలుస్తుందన్నారు. సర్వేపూర్తి తర్వాత పిల్లలను గుర్తించి రెండు రోజులలోగా ఐడి చేసిన పిల్లలు అందరూ పాఠశాలలో ఉండేలా ఎంఈవోలు చూడాలన్నారు. 5 నుండి 18 సంవత్సరాల పూర్తి డేటా ఎంఈఓల వద్ద ఉండాలన్నారు. డ్రాఫ్ ఔట్ అయ్యిన 6, 9 వతరగతి పిల్లలను పాఠశాలలో చేర్పించే బాధ్యత ఎంఈవోలదేనని వారు ఏపాఠశాలలో చదువుతున్నారో అన్న పూర్తి సమాచారం ఎంఈవోల దగ్గర ఉండాలన్నారు. బడి ఈడు పిల్లలను బడికి పంపకుంటే వారికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను రద్దు చేయడం జరుగుతుందన్న విషయాన్ని పిల్లల తల్లిదండ్రులకు తెలియజేయాలని అన్నారు.










