Sep 14,2023 21:26

డా||శివప్రియాంకను అభినందిస్తున్న వైద్యులు

       అనంతపురం : డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో గత నెలలో జరిగిన పీజీ పరీక్షల్లో అనంత వైద్య కళాశాలలో గైనకాలజీ విభాగంలోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ చేస్తున్న డాక్టర్‌ శివప్రియాంక ప్రతిభ చాటారు. 700 మార్కులకు గాను 527 మార్కులు సంపాదించి 75.29 శాతం ఉత్తీర్ణతతో డిస్టింక్షన్‌ సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో అందరికంటే ఎక్కువ మార్కులు పొందిన పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థినిగా రాష్ట్ర స్థాయి టాపర్‌గా ఆమె నిలిచారు. వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీ గైనకాలజీ గోల్డ్‌ మెడల్‌ను సాధించారు. కడప జిల్లా కాజీపేటకు చెందిన రామచంద్రారెడ్డి, నాగమ్మల కుమార్తె డాక్టర్‌ శివ ప్రియాంక. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఆమె ఈ ఘనత సాధించింది. రాష్ట్ర స్థాయి బంగారు పతకం సాధించిన డా||శివ ప్రియాంకను అనంత మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఆచార్య డాక్టర్‌ ఆరేపల్లి శ్రీదేవి అభినందించారు. డాక్టర్‌ వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీ నుంచి 186 మంది పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ వైద్యులు గైనకాలజీ విభాగంలో పరీక్షలు రాయగా అందులో మొదటి స్థానంలో డాక్టర్‌ శివ ప్రియాంక నిలవడం అభినందనీయం అన్నారు. శివ ప్రియాంకకు గైడ్‌గా ఆచార్య డాక్టర్‌ సంధ్య వ్యవహరించారు. భవిష్యత్తులో ఇన్‌ ఫెర్టిలిటీపైన ఫెలోషిప్‌ను చేయాలనుకుంటున్నానని, ప్రసూతి విభాగంలో వచ్చే క్యాన్సర్లు, ప్రత్యుత్పత్తి వైద్య విద్యపైన సూపర్‌ స్పెషాలిటీ ఎంసిహెచ్‌ విద్యను చదవాలనుకుంటున్నానని డాక్టర్‌ శివ ప్రియాంక తెలిపారు. అనంత మెడికల్‌ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో శివ ప్రియాంకను ప్రిన్సిపల్‌ డాక్టర్‌ శ్రీదేవి, వైస్‌ ప్రిన్సిపాళ్లు డాక్టర్‌ కెఎల్‌.సుబ్రహ్మణ్యం, డాక్టర్‌ శారొన్‌ సోనియా, డాక్టర్‌ బిఆర్‌ శ్యాంప్రసాద్‌, గైనకాలజీ ప్రధాన విభాగాధిపతి డాక్టర్‌ శంషాద్‌ బేగం, డాక్టర్‌ సంధ్యలు పుష్పగుచ్చాలు, శాలువా, జ్ఞాపికతో సత్కరించారు.