పీఎం కిసాన్ పథకానికి గడువు పెంచాలి
సిపిఎం జిల్లా కార్యదర్శివాడ గంగరాజు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్
వ్యవసాయంలో ఆర్థిక భరోసా కల్పిస్తూ అన్నదాతకు అండగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. అయితే జిల్లాలో పిఎం కిసాన్ లబ్ధిదారులు 2,50,000 మంది ఉండగా ఈ-కేవైసీ నమోదు చేసుకున్న రైతులు కేవలం 1,28,000 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా సగం మంది పైగా నమోదు కాలేదు. వీరందరికీ న్యాయం చేయాలంటే గడువు పెంచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అత్యధికంగా వ్యవసాయ రైతుల ఉన్నప్పటికీ సరైన అవగాహన కల్పించి నమోదు చేయించడంలో జిల్లా వ్యవసాయ శాఖ పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. ఈ-కేవైసీలో నమోదు చేసుకోవడానికి రైతులకు శాస్త్రీయ పద్ధతుల అవగాహన కల్పించాలన్నారు. అర్హులు అనేకమంది ఉన్నప్పటికీ వారికి నష్టం చేకూరే పరిస్థితి గణనీయంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.6000లు మూడు దఫాలుగా రైతులు ఖాతాల్లో జమచేస్తున్నది, అయితే ఈ పథకంలో సగం మంది రైతులు కూడా అర్హులుగా లేదంటే వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. ఇప్పటికే రైతులు కనీస మద్దతు లేక పండించిన పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రాక అప్పులపాలవుతున్నారు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం రైతులను ఆదుకోకపోవడంతో దీన పరిస్థితి జిల్లాలో నెలకొంది. జిల్లా వ్యవసాయ అధికారులు ఇప్పటికైనా ప్రభుత్వానికి గడువు కావాలని కోరుతూ లేఖ పంపాలని అంతలోపు రైతులు అందరికీ అవగాహన కల్పించి అర్హులుగా చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.










